విద్యార్థులకు అవగాహన కల్పించిన సరూర్నగర్ సర్కిల్ అధికారులు.
ఎల్బీనగర్
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘చెక్ 5’ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విస్తరించాలని సరూర్నగర్ సర్కిల్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తపేట, మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు అధికారులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఐదు ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తూ దోమల పెరుగుదలకు అనువైన ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. చెక్ 5లో భాగంగా పాటించాల్సిన ఐదు అంశాలు:
నీటిని నిల్వ చేసే పాత్రలు: బకెట్లు, డ్రమ్ములు, నీటి ట్యాంకులు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
పూలకుండీల కింద ట్రేలు: పూలకుండీల కింద నీరు నిలిచే ట్రేలను ఎప్పటికప్పుడు ఖాళీ చేసి శుభ్రం చేయాలి.
కూలర్లు, ఏసీ ట్రేలు: కూలర్లు, వాటి కింద ఉండే ట్రేలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పాత టైర్లు: ఉపయోగించని పాత టైర్లలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
ఇతర నీరు నిలిచే వస్తువులు: కొబ్బరి చిప్పలు, ఖాళీ సీసాలు, పాత డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నీరు నిల్వ కాకుండా తొలగించాలి.
నీరు కనిపిస్తే ఈ మూడు పనులు చేయాలి:
క్లియర్ : నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి.
క్లీన్ : నీరు నిలిచే పాత్రలు, ప్రదేశాలను శుభ్రం చేయాలి.
కవర్ : నీటి నిల్వ పాత్రలకు తప్పనిసరిగా మూతలు పెట్టాలి.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈ ఐదు సూత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు, పాఠశాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. విద్యార్థులు తమ ఇళ్లలోనూ ఈ ఐదు అంశాలను పరిశీలించి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు.దోమలు కుట్టకముందే అవి పెరిగే ప్రాంతాలను గుర్తించి అరికట్టడమే ‘చెక్ 5’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవరెడ్డి శానిటేషన్ డిఈ చందన, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రాంబాబు మెట్రోపాలిటన్ సర్వే లైన్ యూనిట్ మోహన్, ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్, టీచర్లు సూపర్వైజర్లు అర్జున్, రుక్కయ్య, నరసింహ, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొని డ్రైడే ఫ్రైడే ఫైవ్ పాయింట్స్ పై అవగాహన కల్పించారు.



