బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశం
ఎల్బీనగర్:
పోక్సో కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన ఎల్బీనగర్ లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే రూ.2 వేలు జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1092/2023గా నమోదైన ఈ కేసులో షేక్ యూనస్ (28), రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం ఆర్‌కే నగర్‌కు చెందిన వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354D, పోక్సో చట్టం-2012లోని సెక్షన్లు11, 12 కింద కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023 డిసెంబర్ 14న సాయంత్రం సుమారు 4.20 గంటల సమయంలో బాధితురాలు శివానీ డిగ్రీ కళాశాల నుంచి ఓమ్ని ఆసుపత్రి బస్‌స్టాప్ వైపు వెళ్తుండగా కొత్తపేట రైతు బజార్ వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో తన ఇంటి సమీపంలో నివసించే నిందితుడు ఆమెను వెంబడించి, సంప్రదింపు వివరాలు అడుగుతూ వేధించాడు. దీంతో బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి విషయం తెలిపింది. అంతకుముందు సుమారు 45 రోజుల క్రితం కూడా నిందితుడు మద్యం మత్తులో ఆమె ఇంటికి వచ్చి పిలిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. బాధితురాలి జన్మతేదీకి సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించి ఆమె మైనర్ అని నిర్ధారించారు.అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట CrPC సెక్షన్ 164 కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితుడిని 2023 డిసెంబర్ 15న అరెస్టు చేసి, దర్యాప్తు పూర్తయిన అనంతరం న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎల్బీనగర్ లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి పద్మావతి నిందితుడిని దోషిగా నిర్ధారించి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి ఎం.ఆర్.ఎస్.వి. ప్రసాద్, సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి. సత్యనారాయణ, కృష్ణ ప్రసన్న కృషి అభినందనీయమని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది.


