Monday, July 27, 2026
Google search engine
Homeతెలంగాణమున్సిపల్‘మాఫియా’ మత్తు.. అక్రమ నిర్మాణాల ఊరేగింపు!

మున్సిపల్‘మాఫియా’ మత్తు.. అక్రమ నిర్మాణాల ఊరేగింపు!

  • *ఎల్బీనగర్ చింతలకుంటలో చట్టాలను బూడిద చేసిన అక్రమార్కులు.
  • *రెసిడెన్షియల్ అనుమతులతో భారీ వాణిజ్య సముదాయం.. అధికారుల అండదండలతో వంద శాతం ఉల్లంఘనలు!
  • విశాల్ మార్ట్ బిల్డింగ్, సరస్వతి ఆర్కేడ్, అక్రమ నిర్మాణా దారులు, ఇటు కోర్టును, మున్సిపల్ నిబంధనలను హేళన చేస్తున్నారు.
  • ఆక్యుపెన్సి తర్వాత అదనపు అంతస్తులు. చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న ఎస్టియం టీం..!
  • లక్షల్లో మున్సిపల్ ఖజానాకు గండి..!
  • ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ దృష్టి సారించాలి..

*ఎల్బీనగర్

పాలక వ్యవస్థ నిద్రపోతోందో లేక ముడుపుల మత్తులో జోగుతోందో తెలియదు కానీ, అక్రమార్కులకు మాత్రం కాసులు కురిపించే యంత్రంలా మారింది! మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్, పెద్ద అంబర్‌పేట్-నాగోలు సర్కిల్ 11, పరిధిలో మున్సిపల్ చట్టాలను బూడిద చేస్తూ బలు భారీ అక్రమ నిర్మాణాలు నిస్సిగ్గుగా సాగుతున్నాయి. స్థానిక చింతలకుంట, ఆగమయ్య నగర్ కాలనీలోని ప్లాట్ నంబర్ 54 వద్ద ‘పండుగ సరస్వతి ఆర్కేడ్’ పేరుతో రూపుదిద్దుకుంటున్న వాణిజ్య భవనం నిబంధనల ఉల్లంఘనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
కేవలం నివాస భవనం (గృహ నిర్మాణం) కోసం అనుమతులు పొంది, ఏకంగా బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తుండటం అధికారుల అవినీతికి, అక్రమార్కుల తెంపరితనానికి అద్దం పడుతోంది.

*ఆక్యుపెన్సీ తర్వాత అదనపు అంతస్తులు.. ప్రమాదాలకు తివాచీ!
భవన యజమాని మున్సిపల్ నిబంధనలను నూటికి నూరు శాతం తుంగలో తొక్కారు. నివాస భవనంగా చూపించి అనుమతులు తెచ్చుకోవడం, ఆపై నివాస అర్హత పత్రం (ఆక్యుపెన్సి సర్టిఫికెట్) పొందడం.. ఆ తర్వాత ఏకంగా అదనపు అంతస్తులను నిర్మించడం ఇక్కడ పరిపాటిగా మారింది.
*చట్టవిరుద్ధ సెల్లార్: ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా భూమిని తొవ్వి ప్రమాదకర రీతిలో సెల్లార్ నిర్మించారు.
*కనీస ఖాళీ స్థలం శూన్యం: భవనం చుట్టూ వదలాల్సిన కనీస స్థలాన్ని (సెట్‌బ్యాక్స్) కాజేసి, సరిహద్దులను దాటి నిర్మాణం చేపట్టారు.

*అగ్నిమాపక రక్షణకు మంగళం: అత్యవసర సమయాల్లో అగ్నిమాపక శకటాలు తిరిగేందుకు కూడా స్థలం లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. భవిష్యత్తులో ఏ చిన్న ప్రమాదం జరిగినా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలవడం ఖాయంగా కనిపిస్తోంది.
పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కళ్లెదుటే ఈ అక్రమ సామ్రాజ్యం విస్తరిస్తున్నా, చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, పత్రికల్లో కథనాలు వస్తున్నా యంత్రాంగంలో చలనం రాకపోవడం వెనుక పెద్ద ఎత్తున ‘రూపాయి’ ఒప్పందాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

*ప్రజాధనానికి గండి.. సామాన్యుడిపై ప్రతాపమా?
మల్కాజ్‌గిరి పురపాలక సంఘం ఇప్పటికే లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి అక్రమ వాణిజ్య నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన లక్షలాది రూపాయల పన్నుల ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
*పౌరుల నిలదీత:”వంద గజాల స్థలంలో ఇల్లు కట్టుకునే సామాన్యుడిని ముప్ప తిప్పలు పెట్టి, కాళ్లరిగేలా తిప్పే అధికారులు.. కోట్ల రూపాయల వాణిజ్య భవనాలను చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న బడా బాబుల ముందు ఎందుకు దండాలు పెడుతున్నారు? సామాన్యుడికి ఒక న్యాయం, ధనవంతుడికి మరో న్యాయమా?” అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించే కుట్ర!
గతంలో చింతలకుంట పల్లవి గార్డెన్స్ పక్కన నిర్మించిన ఒక బహుళ వ్యాపార భవన యజమాని కూడా ఇదే దొంగదారిని ఎంచుకున్నారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, భవనంపై కేవలం ‘సౌర విద్యుత్ రేకులు’ వేసుకుంటున్నానని తప్పుడు ప్రమాణ పత్రం సమర్పించి భవనాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ ‘పండుగ సరస్వతి ఆర్కేడ్’ యాజమాన్యం కూడా అదే తరహాలో కోర్టులను, అధికారులను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

*తక్షణమే భవనాన్ని సీజ్ చేయాలి!
ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడాలి. నాగోలు విభాగాధికారులు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ మరియు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలి.
ప్రజాధనాన్ని దోచుకుంటూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి, భవనాన్ని సీజ్ చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన అధికారులపై, అక్రమ నిర్మాణదారుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments