Wednesday, September 9, 2026
Google search engine
Homeతెలంగాణరాష్ట్రంలో గణాధిపతి ఉత్సవాలకు పటిష్ట భద్రత: డీజీపీ సీవీ ఆనంద్‌

రాష్ట్రంలో గణాధిపతి ఉత్సవాలకు పటిష్ట భద్రత: డీజీపీ సీవీ ఆనంద్‌

  • మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు కఠిన నిఘా
  • సెప్టెంబరు 14 నుంచి గణేశ్‌ నవరాత్రులు ప్రారంభం.. 25న నిమజ్జనం.
  • సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షణ

హైదరాబాద్‌:

రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఉత్సవాల ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్‌ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఎస్‌ఐలతో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేశారు. సెప్టెంబరు 14 నుంచి ప్రారంభం కానున్న ఈ వేడుకలు, అదే నెల 25న జరిగే విగ్రహాల నిమజ్జనంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

*ఆన్‌లైన్ పోర్టల్‌లో మండపాల వివరాలు తప్పనిసరి
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటయ్యే ప్రతి గణేశ్‌ మండలానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. మండపం ఏర్పాటు చేసిన ఖచ్చితమైన ప్రదేశం, నిర్వాహకుల వివరాలు, కమిటీ సభ్యుల పేర్లు, నిమజ్జనానికి ఉపయోగించే వాహనాల సమగ్ర సమాచారాన్ని ఈ పోర్టల్‌లో నమోదు చేయాలి. స్థానిక స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌లకు ప్రత్యేక లాగిన్‌లు కేటాయించినందున, వారు ఎప్పటికప్పుడు మండపాల వద్ద పరిస్థితులను సమీక్షించాలి. పోలీస్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు స్వయంగా మండపాలను సందర్శించి, క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను పాయింట్‌ బుక్కులలో రికార్డు చేయాలని స్పష్టం చేశారు.

*విద్యుత్తు, ట్రాఫిక్‌ నియంత్రణపై ఉక్కుపాదం
మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విద్యుత్తు, అగ్నిమాపక తదితర శాఖలతో సంయుక్తంగా సమన్వయ చర్యలు చేపట్టాలి. నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకునేలా చూడడంతోపాటు, భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల నిఘా, క్యూలైన్ల నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలి. జనసమూహాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రూట్‌ మ్యాప్‌లు రూపొందించాలని ఆదేశించారు.

*నిమజ్జన మార్గాలపై ముందస్తు కసరత్తు
గణేశ్‌ నిమజ్జనానికి వినియోగించే ప్రధాన మార్గాలు, రహదారులు, వంతెనల సామర్థ్యాన్ని ముందుగానే పరిశీలించాలి. నిమజ్జన సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయాలు కలగకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలి. సున్నితమైన ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్‌ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించాలి.

*జియో ట్యాగింగ్‌తో అధునాతన పర్యవేక్షణ
మండపాల ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేసి భద్రతా ఏర్పాట్ల పూర్తి సమాచారాన్ని డిజిటలైజ్ చేయాలి. జియో ట్యాగింగ్‌తోపాటు తనిఖీల వివరాలను ‘టీజీ-కాప్‌’ వేదికపై తక్షణమే అప్‌లోడ్ చేయాలని డీజీపీ ఆదేశించారు.

*కమిటీల సమన్వయం – సామాజిక మాధ్యమాలపై నిఘా
ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీలతో నిరంతరం సమావేశాలు నిర్వహించి ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలి. బందోబస్తు విధుల్లో పాల్గొనే సిబ్బందికి విధి నిర్వహణపై ప్రత్యేక బ్రీఫింగ్‌ ఇవ్వాలి. సామాజిక మాధ్యమాలలో జరిగే ప్రచారాన్ని నిరంతరం పర్యవేక్షించి, శాంతిభద్రతలకు భంగం కలిగించే అసత్య ప్రచారాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజలు, అన్ని శాఖల అధికారులు, ఉత్సవ కమిటీల సంయుక్త భాగస్వామ్యంతో పండుగను ప్రశాంతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సాంకేతిక సేవల విభాగం డీజీ వి.వి. శ్రీనివాసరావు, నిఘా వర్గాల ఐజీ కార్తికేయ, మల్టిజోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, టీస్పార్క్‌ ఎస్పీ రూపేష్‌, ఏఐజీ రమణకుమార్‌, హైదరాబాద్‌ డీసీపీలు అవినాష్‌కుమార్‌, విక్రాంత్‌కుమార్‌ సింగ్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments