Saturday, November 28, 2026
Google search engine
Homeతెలంగాణవనస్థలిపురంలో కత్తులతో దాడులు చేస్తూ సెల్‌ఫోన్ల దోపిడీ

వనస్థలిపురంలో కత్తులతో దాడులు చేస్తూ సెల్‌ఫోన్ల దోపిడీ

ముగ్గురు నిందితుల అరెస్ట్.. రెండు దోపిడీ కేసులు ఛేదించిన పోలీసులు

ఎల్బీనగర్;

అర్ధరాత్రి అలిసి పోయి తమ వాహనాల్లో నిద్రిస్తున్న ఆటో,క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని కత్తులతో దాడులు చేస్తూ సెల్‌ఫోన్లు దోచుకుంటున్న ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు దోపిడీ కేసులను ఛేదించారు.మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీసులు నవంబర్ 27న ఉదయం 6 గంటల సమయంలో పనామా ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేశారు. నిందితులపై ఆయుధాల చట్టం కింద కూడా చర్యలు తీసుకున్నట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో చాదర్‌ఘాట్‌లోని మూసానగర్‌కు చెందిన మహ్మద్ ఫైజాన్ అలియాస్ షూటర్ (22), మహ్మద్ అక్బర్ (20), వేముల రాకేష్ (23) ఉన్నారు.

రెండు దోపిడీ ఘటనల్లో ప్రమేయం

ఈ నెల 25వ తేదీ తెల్లవారుజామున వనస్థలిపురంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ సమీపంలో ఆటో డ్రైవర్ చిన్నం రవికుమార్ తన ఆటోలో నిద్రిస్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతని మొబైల్ ఫోన్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించారు.రవి కుమార్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, నిందితుల్లో ఒకరు కత్తితో అతని కుడి మణికట్టు వద్ద దాడి చేసి గాయపరిచారు. అనంతరం అతని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 2147/2026గా కేసు నమోదైంది.అదే రోజు తెల్లవారుజామున 3 నుంచి 3.30 గంటల మధ్య మల్లికార్జున నగర్ కమాన్ సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ మేఘావత్ రమేష్ సీఎన్‌జీ నింపించుకున్న అనంతరం తన వాహనాన్ని పార్క్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కారు డోర్ తెరిచి అతని వివో సెల్‌ఫోన్‌ను దొంగిలించి పారిపోయారు. వారిని వెంబడించి నిలదీసిన రమేష్‌పై నిందితుల్లో ఒకరు కత్తితో కడుపులో పొడిచారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 2148/2026గా కేసు నమోదు చేశారు.

అర్ధరాత్రి వేళల్లోనే లక్ష్యంగా..

నిందితులు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఒంటరిగా ఉండే ఆటో, క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకునేవారు. వాహనాల్లో నిద్రిస్తున్న వారిని లేదా వాహనాలను పార్క్ చేస్తున్న వారిని గుర్తించి సెల్‌ఫోన్లు దొంగిలించేవారు. బాధితులు మేల్కొని ప్రతిఘటించినా, నిలదీసినా కత్తులతో దాడులు చేసి అక్కడి నుంచి పరారయ్యేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం
నిందితుల నుంచి 2147/2026 కేసుకు సంబంధించి ఒక ఇన్ఫినిక్స్ సెల్‌ఫోన్, 2148/2026 కేసుకు సంబంధించి ఒక వివో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ ఫైజాన్‌పై గతంలో ఆర్జీఐఏ, మీర్‌పేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మహ్మద్ అక్బర్‌పై చాదర్‌ఘాట్, ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లలో గత కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆపరేషన్

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, ఎల్బీనగర్ జోన్ డీసీపీ బి. అనురాధ, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. వనస్థలిపురం ఏసీపీ పి. కాశిరెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఎస్. రవిబాబు, డీఐ బి. రాజేష్, ఎస్‌ఐ వి. రవి, సీసీఎస్ ఎల్బీనగర్ ఇన్‌స్పెక్టర్ జి. గోవిందరావు, సీసీఎస్ బృందం, వనస్థలిపురం క్రైమ్ టీమ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పి.ఎన్. కరణ్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments