హైదరాబాద్
వర్షం ఎప్పుడు పడినా.. ఏ మాత్రం కురిసినా వరద నీరు నేరుగా చెరువులకు చేరేలా హైడ్రా చర్యలు చేపట్టింది. కాలువలను శుభ్రం చేస్తోంది. పూడికను తొలగించడంతో పాటు.. మధ్యలో ఎలాంటి అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకు గాను హైడ్రా ఎంఆర్టీ (మాన్సూన్ రెస్పాన్స్ టీమ్) టీమ్లతో పాటు.., హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలను పెద్దసంఖ్యలో వినియోగిస్తోంది. నగరం నలువైపులా చెరువుల చెంత ఉన్న అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించడంతో పాటు.. చెరువుకు ఉండే ఇన్లెట్లు, ఔట్లెట్లు సరిగా ఉన్నాయా లేదా చూస్తున్నారు. కొన్ని చెరువుల్లో గుర్రపుడెక్కను తొలగిస్తున్నారు. చెరువుల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించి అందరికీ యాక్సెస్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలంలో వరద ముప్పును తగ్గించేందుకు రంగంలోకి దిగే హైడ్రా బృందాలు.. వర్షాలు లేని సమయంలో చెరువుల పరిరక్షణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాయి. చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, పూడికతీత చేపట్టడం, నీటిపై విస్తరించే గుర్రపుడెక్కను తొలగించడం వంటి పనులతో పాటు, నీటి ప్రవాహ వ్యవస్థను మెరుగుపరిచే చర్యలకూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అత్యవసర సమయాల్లో వరద నివారణకు సిద్ధంగా ఉంటూనే, సాధారణ రోజుల్లోనూ జలవనరుల నిర్వహణకు ఎంఆర్టీ (MRT) బృందాల సేవలను హైడ్రా వినియోగిస్తోంది.
- చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు
దసరా పండగ వేళ బతుకమ్మ ఆటలకు వీలుండే చెరువులకు ప్రాధాన్యతనిస్తూ వ్యర్థాల తొలగింపుతో పాటు.. పరిసరాల్లో పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను క్లియర్ చేస్తున్నారు. ఎం ఆర్ టీ, డీఆర్ ఎఫ్ బృందాలు పెద్దమొత్తంలో రంగంలోకి దిగి పనులు చేస్తున్నాయి. కుత్బుల్లాపూర్లోని లింగంచెరువు, దూలపల్లి లేక్, లింగంపల్లిలోని గోపి చెరువు, మియాపూర్లోని గుర్నాథచెరువు, పాలె చెరువు, మైసమ్మకుంట, హయత్నగర్లోని బతుకమ్మకుంట, మన్సూరాబాద్ లేక్, సరూర్నగర్ ఇలా నగరం నలువైపులా ఉన్న చెరువులను శుభ్రం చేస్తున్నారు. చెరువుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను తొలగించడంతో పాటు, అవసరమైన చోట పూడికతీత పనులు చేపడుతోంది. చెరువుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా జలవనరుల నిర్వహణను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. గుర్రపుడెక్కను తొలగించడం, నీటి ఉపరితలాన్ని శుభ్రపరచడం వంటి పనులపైనా హైడ్రా దృష్టి సారించింది. వ్యర్థాల తొలగించడం ద్వారా చెరువులను మెరుగైన స్థితిలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. - చెరువుల్లోకి నీరు చేరేలా..
ప్రతి చెరువుకు ఇన్లెట్ – ఔట్లెట్ సరిగా ఉండేలా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం ద్వారా వెంటనే వర్షపు నీరు చెరువుకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్లెట్లు, ఔట్లెట్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. చెరువుల్లోకి నీరు చేరే మార్గాల్లో అడ్డంకులను గుర్తించడం, బయటకు వెళ్లే నీటికి ఆటంకాలు లేకుండా చూడటం, అనుసంధాన నాలాల పరిస్థితిని మెరుగుపరచడం వంటి పనులను ముమ్మరం చేసింది హైడ్రా. వర్షాకాలంలో పని చేసే ఎంఆర్టీ బృందాలు ముమ్మరంగా ఈ పనులు చేపట్టాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడంలేదు.. ఒక్కోసారి కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం కూడా ఉంది. వర్షాలు పడితే నేరుగా వరద నీరు చెరువుకు చేరేలా ఇన్లెట్లను సిద్ధం చేస్తున్నారు. కూకట్పల్లి నాలాలో పూడిక తీత పనులను పెద్దయెత్తున చేపట్టింది హైడ్రా. ఇప్పటికే 40 ట్రక్కుల వరకూ చెత్తను తరలించింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర పూడికను తొలగించి వరద ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తోంది.



