- హయత్‌నగర్‌ను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి..
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్,
బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్ ల డిమాండ్ .
వనస్థలిపురం
హయత్‌నగర్ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ జిల్లాలో కలిపే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా ముందుకు వెళ్తే, హయత్‌నగర్ మండల ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు. వనస్థలిపురంలోని ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ కేంద్రంగా, దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై జోరుగా ప్రచారం జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ కొత్త జిల్లా పరిధిలోకి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు హయత్‌నగర్ ప్రాంతాన్ని కూడా చేర్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఈ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కుంట్లూరు వెంకటేష్ గౌడ్, బొంగు వెంకటేష్ గౌడ్ కోరారు. హయత్‌నగర్ ప్రాంతానికి ప్రత్యేకమైన భౌగోళిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఉందని వారు వివరించారు. హైదరాబాద్ నగర శివార్లలో వేగంగా విస్తరిస్తున్న ఈ ప్రాంతంలో జనాభా నానాటికీ పెరుగుతోందని, కొత్త కాలనీలు, నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు. ఈ భౌగోళిక పరిస్థితులు, జనాభా పెరుగుదలను శాస్త్రీయంగా పరిగణనలోకి తీసుకుని పరిపాలనా నిర్ణయాలు ఉండాలని అన్నారు.
ఉమ్మడి మూడు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని వారు తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలు, ఇక్కడి భౌగోళిక స్థితిగతులు, జనాభా ప్రాతిపదికను పట్టించుకోకుండా ఏకపక్షంగా హయత్‌నగర్‌ను మరో జిల్లాలో కలిపే ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని అన్నారు.
హయత్‌నగర్ మండలాన్ని ఇతర జిల్లాల్లో కలపడానికి బదులుగా, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనే స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని కుంట్లూరు వెంకటేష్ గౌడ్, బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో పునరాలోచన చేయాలని, ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచించారు. ఒకవేళ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం ఉధృతం చేస్తామని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ తరఫున వారు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఘోర శ్యాంసుందర్ గౌడ్, మద్దిమడుగు రాజశేఖర్, తెలంగాణ రాష్ట్ర ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల మల్లేష్ యాదవ్, న్యాయవాది దినేష్ కుమార్, పందిరి వినోద్ గౌడ్, రెడ్డి సంఘం కమిటీ ప్రధాన కార్యదర్శి గుర్రం విజ్ఞాన్ రెడ్డి, తెలంగాణ బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, గజ్జె శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారులు కారింగుల నరేందర్ గౌడ్, రాజనగర శ్రీకాంత్, పందుల వెంకటేష్ గౌడ్, ఉయ్యాల కుమార్ గౌడ్, కొంగరి కృష్ణ పద్మశాలి, మామిడి గిరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


