Wednesday, October 14, 2026
Google search engine
Homeతెలంగాణహైకోర్టు ఆదేశాలూ బేఖాతరు: ఆగని అక్రమ నిర్మాణాలు!

హైకోర్టు ఆదేశాలూ బేఖాతరు: ఆగని అక్రమ నిర్మాణాలు!

  • భూకబ్జాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు
  • సోమవారం ఒక్కరోజే బాధితుల నుంచి 56 వినతులు
  • తక్షణ పరిష్కారానికి ఆదేశించిన కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్

హైదరాబాద్

న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ, రికార్డులను పక్కనపెట్టి ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, క్రీడా ప్రాంగణాలను ఆక్రమించే ముఠాల ఆగడాలు నగరంలో కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం నిర్వహించిన ‘హైడ్రా ప్రజావాణి’ కార్యక్రమానికి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఏకంగా 56 ఫిర్యాదులు రావడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్, వాటన్నింటినీ వెనువెంటనే విచారించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హైకోర్టు సర్వే ఉత్తర్వులున్నా లొంగని కబ్జాదారులు:
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇంజాపూర్ పరిధిలోని 126వ సర్వే సంఖ్యలో దాదాపు 74.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలాన్ని కాపాడాలని స్థానికులు రెవెన్యూ అధికారులకు విన్నవించడమే కాకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సదరు భూమిని సంపూర్ణంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది.
అయితే న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆక్రమణదారులు ఏమాత్రం లెక్కచేయకుండా అక్కడ పెద్ద ఎత్తున గిడ్డంగులు నిర్మించి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారని స్థానికులు ప్రజావాణిలో వాపోయారు. తక్షణమే సర్వే ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని కోరారు.
అలాగే తుర్కయాంజల్ తొర్రూరు విభాగానికి చెందిన ఇంజాపూర్ వద్ద ఉద్యానవనం కోసం కేటాయించిన 1200 గజాల స్థలాన్ని విభాగాలుగా మార్చి విక్రయిస్తున్నారని, కుంట్లూరు జయప్రకాష్ నగర్ మంజీరా కాలనీలో 577 గజాల ఉద్యానవన స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదులు అందాయి.

చెరువు నీటితో వాణిజ్య వ్యాపారం:
స్థానికుల ఆందోళన
కూకట్‌పల్లి నల్ల చెరువులో సుమారు ఐదు మీటర్ల మేర పేరుకుపోయిన పూడికను తొలగించి, నీటి పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. అయితే, ఈ నీటి ఫలాలు స్థానిక నివాసితులకు దక్కకుండా కొందరు నీటి వ్యాపారులు వాణిజ్య అవసరాల కోసం పెద్ద ఎత్తున బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారని స్థానికులు చిత్రాలు, దృశ్య ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

నాలాలు, చెరువుల మళ్లింపులతో ముంపు ముప్పు:

  • హయత్ నగర్: నాగోలు నుంచి కుంట్లూరు వెళ్లే దారిలోని నాలాతో పాటు దాని పక్కనున్న 300 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. నాలాపై నిర్మించిన గదుల వల్ల వరద ప్రవాహానికి తీవ్ర అడ్డంకి ఏర్పడుతోంది. సాహేబ్‌నగర్ కళాన్ గ్రామంలోని 7.34 ఎకరాల ప్రభుత్వ స్థలం కూడా కబ్జాకు గురవుతోంది.
  • శామీర్‌పేట: దేవరయాంజల్ పరిధిలోని కోమటికుంట చెరువు విస్తీర్ణంలోనూ, సర్వే సంఖ్య 63లోని ప్రభుత్వ, దేవాలయ నిధుల భూముల్లోనూ చట్టవిరుద్ధ నిర్మాణాలు జరుగుతున్నాయి.
  • దుండిగల్: బహుదూర్ పల్లి సర్వే సంఖ్య 131/1లో 20 గుంటల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది.
  • యాప్రాల్ – కౌకూరు: వరద కాలువలను ఆక్రమించి కొత్త నివాస స్థలాలుగా మార్చడం వల్ల వరద నీరు రోడ్లపైకి వస్తోందని నివాసితుల సంక్షేమ సంఘాలు ఫిర్యాదు చేశాయి.
  • ఆర్‌.కె.పురం చెరువు: చెరువు విస్తీర్ణంలో సుమారు రెండు ఎకరాల మేర ఆక్రమించి కటికశాలను నిర్మించడమే కాకుండా, వ్యర్థాలను చెరువు నీటిలోకి వదులుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆటస్థలం.. సంతగా మార్పు!
కవాడిగూడ గాంధీనగర్‌లోని ఘంటసాల క్రీడా ప్రాంగణం అనేకమంది జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దింది. ఇండోర్ క్రీడా వేదిక, వాలీబాల్ మైదానాలు ఉన్న ఈ స్థలాన్ని వారాంతపు కూరగాయల సంతగా మార్చివేయడంతో క్రీడాకారులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, ఈ ప్రాంగణాన్ని తక్షణమే క్రీడలకే కేటాయించాలని స్థానికులు కోరారు.

మొత్తంగా, ప్రజావాణికి వచ్చిన ఈ ఫిర్యాదులపై హైడ్రా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, తక్షణమే ఆక్రమణలను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments