Wednesday, September 23, 2026
Google search engine
Homeతెలంగాణఅవినీతికి ఆజ్యం :‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్‌లో పారదర్శకత లోపం...!

అవినీతికి ఆజ్యం :‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్‌లో పారదర్శకత లోపం…!

  • కోట్లాది ప్రజాధనం స్వాహా!
  • “బిల్డ్ నౌ వెబ్ సైట్” పబ్లిక్ పోర్టల్ లో పారదర్శకత లేకపోవడం: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది..!
  • ‘ఐదు నిమిషాల అనుమతులు’ కేవలం భ్రమ.. ఏఐ (AI) దొడ్డిదారిన టీడీఆర్ (TDR) కుంభకోణాలు, దొంగ ఓసీల (OC) దందా!
  • కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అబాసపాలు కాకముందే దృష్టి సారించాలి…!
  • ఏ.సీ.బీ,విజిలెన్స్ , ఐ.బీ విభాగాలు దృష్టి సారించాలి…!
  • మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..

బిల్డ్ నౌ సాఫ్ట్‌వేర్.. పరమ అవినీతి! పారదర్శకత లోపం (ట్రాన్స్ఫరెన్సీ శూన్యం).. ‘ఐదు నిమిషాల అనుమతులు’ అంటూ ప్రభుత్వం ఊదరగొట్టిన ‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్, నేడు అక్రమార్కులకు కామధేనువుగా, సామాన్యుడి పాలిట సింహస్వప్నంగా మారింది.
ఏఐ ఆటోమేషన్ ముసుగులో టౌన్ ప్లానింగ్, విద్యుత్, జలమండలి అధికారులు రియల్ మాఫియాతో కుమ్మక్కై కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా స్వాహా చేస్తున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి టీడీఆర్ బాండ్ల దందా, మార్ఫింగ్ ఓసీల దైవభూమి దోపిడీ సాగిస్తున్నారు. అడ్డగోలు లంచాలతో బడాబాబుల బాగోతం నడుస్తుంటే, చిన్నిల్లు కట్టుకునే సామాన్యుడిని మాత్రం టెక్నికల్ ఎర్రర్ల పేరిట నిలువునా మోగిస్తున్నారు. డిజిటల్ పారదర్శకత భ్రమేనా?

(పరిశోధనాత్మక పాత్రికేయులు మీ.. ఎం.వేణుగోపాల్ )

హైదరాబాద్: సెప్టెంబర్ 22 భారత శక్తి,

తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను ప్రక్షాళన చేస్తామంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అత్యాధునిక ‘బిల్డ్ నౌ’ (BuildNow) వెబ్‌సైట్ అంతులేని అవినీతికి, అక్రమాలకు అడ్డాగా మారుతోంది. పారదర్శకత నినాదంతో ముందుకు తెచ్చిన ఈ డిజిటల్ విధానం, ఆ పారదర్శకత శూన్యం కావడంతో క్షేత్రస్థాయిలో సర్వనాశనమై ప్రజల నడ్డి విరుస్తోంది. కేవలం ఐదు నిమిషాల్లో అనుమతులంటూ ఊదరగొడుతున్న ఈ పోర్టల్, ఆటోమేషన్ ముసుగులో మహా కుంభకోణాలకు పునాదిగా మారుతోందనేది అక్షర సత్యం.
గతంలో అమలులో ఉన్న డీపీఎంఎస్ (DPMS), టీఎస్-బిపాస్ (TS-bPASS) విధానాల లోపాలను సరిదిద్దుతామని చెప్పిన పాలకులు, నేడు ‘బిల్డ్ నౌ’ పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటున్న వైనంపై ‘భారత శక్తి’ ప్రత్యేక దర్యాప్తు కథనం.

పాత రోగాలకు కొత్త మందు: ‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్‌లో వరదర్శకత లోపం వల్ల కోట్ల కొద్దీ అవినీతి:

సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అవినీతిని అంతం చేస్తామన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలయ్యాయి. ‘బిల్డ్ నౌ’ పబ్లిక్ పోర్టల్‌లో ఉన్న స్పష్టత లోపాన్ని, పర్యవేక్షణ రాహిత్యాన్ని ఆసరాగా చేసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు, అనధికార కన్సల్టెంట్లు కలిసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. సాంకేతిక లోపాలు సామాన్యుడిని బలి చేస్తుంటే, అక్రమార్కులకు మాత్రం ఈ వెబ్‌సైట్ ఒక కామధేనువులా మారింది.
బిల్డ్ నౌ వెబ్సైట్ లో ట్రాన్స్ఫరెన్సీ లేకపోవడంతో ఏ తప్పు చేసినా దుర్గము ఎవరూ పట్టుకోలేరు అనే నేపంతో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వం నిషేధ భూముల్లో అనుమతులు ఎల్ఆర్ఎస్ చార్జెస్ లేకుండా అనుమతులు నలా కన్వర్షన్ లేకుండా అనుమతులు ఇస్తున్నారు. అదేవిధంగా పలుమార్లు రిజెక్ట్ అయిన ఓ.సి సర్టిఫికెట్లను సైతం మంజూరు చేస్తున్న దుస్థితి నెలకొంది..

*టీడీఆర్ (TDR) బాండ్ల దందా – నిబంధనలకు తిలోదకాలు:
‘బిల్డ్ నౌ’ పోర్టల్ వేదికగా సాగుతున్న అత్యంత పెద్ద కుంభకోణం టీడీఆర్ బాండ్ల మార్పిడి. నగరంలో ఎక్కడో మూలన ఉన్న నిరుపయోగ భూములు, వివాదాస్పద స్థలాలను చూపించి, వెబ్‌సైట్ లొసుగులను అడ్డుపెట్టుకుని అక్రమంగా టీడీఆర్ బాండ్లను జారీ చేస్తున్నారు.

  • నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పత్రాలను అప్‌లోడ్ చేస్తున్నా ఏఐ (AI) స్క్రీనింగ్ వ్యవస్థ వాటిని గుర్తించలేకపోతోంది.
  • ఇదే అవకాశంగా భావిస్తున్న అవినీతి అధికారులు, రియల్ మాఫియాతో కుమ్మక్కై కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లను అక్రమంగా చలామణి చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

*మార్ఫింగ్ ఓసీలు (OC) – దొంగ సర్టిఫికెట్ల విలయం:
భవన నిర్మాణం పూర్తయిన తర్వాత జారీ చేయాల్సిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) ప్రక్రియలో ‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్ పారదర్శకత లోపం వల్ల పూర్తిగా దిగజారిపోయింది.

  • నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లు వదలకపోయినా, అదనపు అంతస్తులు నిర్మించినా, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే పోర్టల్‌లో ఆటోమేటిక్ అప్రూవల్స్ ఇస్తున్నారు.
  • కిందిస్థాయి అధికారులు లంచాలు తీసుకొని మార్ఫింగ్ చేసిన నకిలీ ఓసీ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ, అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తున్న దారుణమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొంది.

*విద్యుత్, జలమండలి అధికారుల అక్రమ సంపాదన:
కేవలం టౌన్ ప్లానింగ్ విభాగానికే పరిమితం కాకుండా, ఈ దోపిడీలో ట్రాన్స్‌కో విద్యుత్ అధికారులు, వాటర్ వర్క్స్ (జలమండలి) అధికారులు సైతం భాగస్వాములు అవుతున్నారు.

  • ‘బిల్డ్ నౌ’ పోర్టల్ నుంచి సరైన అనుమతులు లేకున్నా, వెబ్సైట్లో పరదర్శకత లేకపోవడం వల్ల, మార్ఫింగ్ చేసిన పత్రాల ఆధారంగానే విద్యుత్ మీటర్లు, నల్లా కనెక్షన్లు జేబులు నింపుకొని ఇష్టారాజ్యంగా మంజూరు చేస్తున్నారు.
  • ఈ శాఖల మధ్య సమన్వయం లోపించడం, ఆన్‌లైన్ డేటా బేస్‌లో భద్రత కొరవడటంతో ప్రభుత్వ నిధులు మరియు వనరులు అన్యాక్రాంతం అవుతున్నాయి.

*సామాన్యుడిపై సాంకేతిక వేధింపుల కొరడా
ఒకవైపు బడా అక్రమార్కులు కోట్లు దండుకుంటుంటే, సొంతిల్లు నిర్మించుకోవాలనుకునే సామాన్యుడికి మాత్రం ఈ వెబ్‌సైట్ చుక్కలు చూపిస్తోంది. చిన్నచిన్న మిల్లీమీటర్ల వ్యత్యాసాలు, అంతుచిక్కని టెక్నికల్ ఎర్రర్ కోడ్స్‌తో దరఖాస్తులను పదే పదే తిరస్కరిస్తున్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం దొరకక, లంచాలు ఇస్తే తప్ప ఫైలు ముందుకు కదలని దుస్థితి ఏర్పడింది.

ఆటోమేషన్ ముసుగులో సాగుతున్న ఈ డిజిటల్ దోపిడీకి తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ‘బిల్డ్ నౌ’ వెబ్‌సైట్‌లోని లోపాలను , పారదర్శకతను సక్రమంగా నిర్వహించకపోతే, నిర్మాణ అనుమతులకు అనుసంధానంగా ఉన్న శాఖలను సమన్వయం చేసుకొని, అప్పుడు సర్టిఫికెట్లు రాకుండా సరిదిద్దకపోతే, ఇది సామాన్యుడి పాలిట శాపంగా మారడమే కాకుండా, ప్రభుత్వ పరువును బజారుకీడుస్తుంది. అక్రమాలకు పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్, విద్యుత్, జలమండలి అధికారులపై టిడిఆర్ దళారులపై కఠిన చర్యలు తీసుకుని, సమగ్ర దర్యాప్తు జరిపితేనే ప్రజాధనం రక్షించబడుతుంది. లేనిచో, ప్రజాగ్రహానికి పాలకులు మూల్యం చెల్లించుకోక తప్పదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments