డ్రైనేజీ, తాగునీటి సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
ఎల్బీనగర్
మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్ డివిజన్ పరిధిలో గల ఎన్టీఆర్ నగర్ ఫేజ్-2, సాయిబాబా నగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీ వాసులు తమ ప్రాంతాల్లో నెలకొన్న డ్రైనేజీ పొంగిపొర్లడం, మురుగునీటి సమస్యలు, తాగునీటి సరఫరాలో ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అక్కడే ఉన్న జలమండలి డిజిఎం చంద్రు నాయక్ తో మాట్లాడి తాగునీటి సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.అదేవిధంగా పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్యపై ఎంఎంసి ఈఈ కార్తీక్ తో ఫోన్‌లో మాట్లాడి, సుమారు 20 మీటర్ల మేర పైప్‌లైన్ డయామీటర్‌ను పెంచి, పక్కనే ఉన్న నాలాకు అనుసంధానం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మరో 20 రోజుల్లో తిరిగి ఈ ప్రాంతంలో పర్యటిస్తానని, అప్పటిలోగా తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే వరకు అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పనిచేయాలని స్పష్టం చేస్తూ బస్తీ వాసులకు భరోసా కల్పించారు.ఈ పర్యటనలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అరవింద్ శర్మ, నగేశ్, సాజిద్, ఊర్మిళ రెడ్డి కార్యకర్తలు, బస్తీ వాసులు పాల్గొన్నారు.


