తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలని నిరసన గళం- ఇబ్రహీంపట్నంలో చావు డప్పు కొట్టి కాంగ్రెస్ శ్రేణుల నిరసన
ఇబ్రహీంపట్నం:
అధికారం కోల్పోయామనే అక్కసుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే శాసనసభాపతిపై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వారి దళిత వ్యతిరేక అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దళిత విభాగం పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా కుంట్లూర్ చౌరస్తాలో వినూత్న రీతిలో చావు డప్పు కొట్టి బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
*రాజ్యాంగ వ్యవస్థల పట్ల దొరల అహంకారం
భారత రాజ్యాంగం కల్పించిన అత్యున్నతమైన పవిత్ర పీఠంపై ఆసీనులై ఉన్న దళిత బిడ్డ, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం దుర్మార్గం. దళిత నాయకత్వం రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక, రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడటం ఆ పార్టీ సంస్కారహీనతకు పరాకాష్ట. సభాపతిని, వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ మాట్లాడిన తీరు కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, ఇది యావత్ సమాజానికీ, పీడిత వర్గాలకు జరిగిన అవమానమని నేతలు మండిపడ్డారు.

*చట్టచర్యలు తీసుకోవాలని డిమాండ్
సభా మర్యాదలను మంటగలుపుతూ, పరుష పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును తక్షణమే శాసనమండలి నుండి అనర్హుడిగా ప్రకటించి, చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభకు రాకుండా తెరవెనుక నుండి ఇలాంటి దుర్మార్గపు పోకడలను ప్రోత్సహిస్తున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వెంటనే దళితులకు, రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్, బాటసింగారం సొసైటీ బ్యాంకు చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, పెద్ద అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు పండుగల రాజు, కుంట్లూర్ డివిజన్ అధ్యక్షులు భీమగోని భాస్కర్ గౌడ్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధంకి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు రాజ్ కుమార్ పాలడుగు, నాగార్జున, సీనియర్ నాయకులు ఎరుకల భాస్కర్ గౌడ్, సుప్రసిద్ధారెడ్డి, చేగురు వెంకటేష్, రాజేంద్రప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి గౌడ్, నర్సింగ్, శ్రీనివాసరెడ్డి, సుర్వి ప్రవీణ్ గౌడ్, గిరీష్ మహంత్, గుడ్ల రవి, శివ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.


