ఎల్బీనగర్:
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, వివిధ డిజిటల్ వేదికల్లో మార్ఫింగ్ చేసిన తప్పుడు మరియు ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలు, దుష్ప్రచార కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిపై తక్షణమే దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనా చారి ఈ మేరకు తెలంగాణ డీజీపీకి మహేష్ మురళీధర్ భగవత్ (లా & ఆర్డర్)కి బీఆర్ఎస్ శాసనసభాపక్షం తరఫున ఫిర్యాదు అందజేశారు. రెండు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి,దురుసు ప్రవర్తన ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కావాలనే ఫేక్ డిజిటల్ కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్/ఏఐ జనరేటెడ్ చిత్రాలను నిజమైనవిగా చూపిస్తూ ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడంతో పాటు ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ శాసనసభా పక్షం పేర్కొంది.సైబర్ క్రైమ్ విభాగం వెంటనే ఫేక్,మార్ఫింగ్, ఏఐ జనరేటెడ్ చిత్రాలు పోస్టులను గుర్తించి దర్యాప్తు చేయాలి.వాటిని రూపొందించి అప్లోడ్ చేసి ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించాలి.చిత్రాలపై సాంకేతిక ఫోరెన్సిక్ దర్యాప్తు నిర్వహించాలి. సైబర్ క్రైమ్, పరువునష్టం, తప్పుడు సమాచార ప్రచారం తదితర వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. సంబంధిత డిజిటల్ ఆధారాలు,అకౌంట్ వివరాలు,URLలు,టైమ్‌స్టాంప్‌లు,మెటాడేటాను భద్రపరచాలి. తప్పుడు మార్ఫింగ్ కంటెంట్ వ్యాప్తిని అడ్డుకుని ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలి. రాజకీయ భేదాలు ఉన్నాయనే కారణంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై కల్పిత డిజిటల్ కంటెంట్‌ను తయారు చేసి ప్రచారం చేయడం సమర్థనీయం కాదని బీఆర్ఎస్ శాసనసభాపక్షం స్పష్టం చేసింది.అలాగే అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో పోలీసుల వైఖరిపై, అలాగే సంబంధిత కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతంగా,అత్యవసరంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.


