- *-సమస్యను తక్షణమే పరిష్కరించాలి
- *-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
హైదరాబాద్, ఆగస్టు 03: భారత శక్తి,
రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళలో పనిచేస్తున్న జర్నలిస్టులకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పలువురు ఫెడరేషన్ నాయకులతో కలిసి సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ ముకుంద రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అక్రెడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమై నాలుగైదు నెలలవుతున్నా, ఇంతవరకు అర్హులైన జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్ కార్డులు అందలేదని, ముఖ్యంగా కేబుల్ ఛానళ్ళకు సంబందించిన జర్నలిస్టులకు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని మామిడి సోమయ్య అన్నారు. ఇప్పటివరకు అనేక కొర్రీలు పెట్టి కేబుల్ ఛానళ్ళ అక్రెడిటేషన్ కార్డుల సమస్యను పరిష్కరించలేదని, జిల్లాల్లో డీపీఆర్వోలు కేబుల్ ఛానల్ జర్నలిస్టులను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అన్ని అర్హతలున్న కేబుల్ ఛానళ్ళకు వెంటనే అక్రెడిటేషన్ కార్డులివ్వాలని, జిల్లా కేంద్రంలో స్టూడియో ఉండాలన్న నిబంధనను సడలిస్తూ సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎంఐబీ రిజిస్ట్రేషన్ తో ఐపీ బాక్స్ ల ద్వారా నడుస్తున్న అన్ని ఛానళ్ళకు కూడా అక్రెడిటేషన్ కార్డులివ్వాలని మామిడి సోమయ్య కోరారు. కేబుల్ ఛానళ్ళ అక్రెడిటేషన్ల సమస్య అతి త్వరలోనే పరిష్కారమవుతుందని స్పెషల్ కమీషనర్ ముకుంద రెడ్డి అన్నారు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులందరికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో-కన్వీనర్ ఆర్.శ్రీనివాస్ గౌడ్, కేబుల్ ఛానళ్ళ ప్రతినిధులు మహ్మద్ షఫీవుద్దీన్, జీవన్ కుమార్ గౌడ్, ఫారూఖ్ పటేల్, జూలూరు సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


