ఐత.అనూప్ చక్రవర్తి జన్మదిన వేడుకల సందర్భంగా నిరుపేదలకు అన్నప్రసాద వితరణ
హైదరాబాద్:
నగరంలోని గాంధీ, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రుల ప్రాంగణంలో ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మెరుగైన వైద్యం కోసం వచ్చిన పేద రోగులు, వారి వెంట వచ్చిన సహాయకులు, నిరాశ్రయుల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పౌష్టికాహారాన్ని ఉచితంగా అందజేశారు.
శ్రీమాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ స్థానిక సలహా సంఘం సభ్యులు ఐత అనూప్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఫౌండేషన్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ఉత్సాహంగా పాలుపంచుకుని తమ స్వహస్తాలతో భోజనం వడ్డించారు. ఆకలితో అలమటించే సామాన్యులకు అండగా నిలవడమే పరమార్థంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.
వైద్య సేవల కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలకు ఈ భోజన వసతి ఎంతో ఊరటనిచ్చిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక అసమానతల నడుమ, ఇటువంటి సేవలు మానవతా దృక్పథాన్ని సజీవంగా ఉంచుతున్నాయని పలువురు ప్రశంసించారు.
ఈ సందర్భంగా ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ ప్రతినిధి పెద్ది శంకర్ మాట్లాడుతూ, సమాజంలో సేవ చేయాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాతలు, సేవకులు తమ వంతు సహాయ సహకారాలను అందించడం ద్వారా మరింత మంది ఆకలి తీర్చగలమని, భవిష్యత్తులోనూ ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.



