- ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కో కోటి రూపాయల చొప్పున రూ.3 కోట్ల భారీ బీమా చెక్కుల అందజేత
- ఎస్బీఐతో సమన్వయం చేసుకుని ఆపద్బాంధవుడిగా నిలిచిన రాష్ట్ర పోలీసు బాస్
హైదరాబాద్:
సమాజ రక్షణ కోసం నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సి.వి.ఆనంద్ భరోసా కల్పించారు. విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్ల భారీ బీమా పరిహార చెక్కులను సోమవారం డిజిపి కార్యాలయంలో మృతుల కుటుంబ సభ్యులకు ఆయన స్వయంగా అందజేశారు.
*రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి:
శంకర్‌పల్లి పరిధిలో 2025 ఫిబ్రవరి 3న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ముత్తంగి శ్రీనివాస్ అమరులయ్యారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ నేపథ్యంలో స్పందించిన డిజిపి సి.వి.ఆనంద్, మృతుని తండ్రి ముత్తంగి యాదయ్యకు రూ.1 కోటి బీమా చెక్కును అందజేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు.
*ఇద్దరు సిబ్బంది కుటుంబాలకు భరోసా
నల్లగొండ జిల్లా కనగల్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2004 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ బోలెపల్లి సైదులు 2025 జూన్ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదేవిధంగా, వరంగల్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కె.వెంకటరెడ్డి 2026 మార్చి 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విధి నిర్వహణలో భాగంగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతో వెంకటరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ మృతులందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో జీతాల ఖాతా ఉండటంతో, డిజిపి సి.వి.ఆనంద్ ప్రత్యేక చొరవ తీసుకుని బ్యాంక్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. సకాలంలో ప్రక్రియను పూర్తి చేసి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున బీమా పరిహారం అందేలా చొరవ చూపారు.
*కుటుంబాల సంక్షేమానికి సర్వదా సిద్ధం: డిజిపి సి.వి.ఆనంద్
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు డిజిపి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రాణాలను తృణప్రాయంగా భావించి విధులు నిర్వర్తిస్తూ అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలను పోలీసు శాఖ ఎన్నడూ విస్మరించదని, సర్వదా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాల సంక్షేమం కోసం శాఖ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో డిజిపితో పాటు ఎస్‌బీఐ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



