హైదరాబాద్:
మడమ తిప్పని నైజం, వెరవని మనస్తత్వం, ప్రజల కోసం ఎంతటి వారినైనా ఎదురించే సాహసానికి ప్రత్యక్ష నిదర్శనం ‘టైగర్’ ఆలె నరేంద్ర. హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాల నుంచి మొదలైన ఆయన ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ప్రజాపోరాట చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం. రాజీపడని ధోరణితో, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన తీరే ఆయనకు ‘టైగర్’ అనే అభిధానాన్ని తెచ్చిపెట్టింది. నేడు ఆయన 80వ జయంతి సందర్భముగా సుందరయ్య విజ్ఞాన కేంద్రములో ప్రత్యేక కార్యక్రమములు నిర్వహించబడుతున్నాయి.
*సాధారణ కుటుంబం నుండి ఉద్యమ నాయకుడిగా
1946లో హైదరాబాద్ నగరంలో ఆలే రామలింగం, పుష్పవతి దంపతులకు జన్మించిన నరేంద్ర గారు, నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం కృషి చేశారు. పాతబస్తీ సామాజిక, రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ పెరిగిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండేవారు. రాజకీయ ప్రత్యర్థులకు వెరవక, ప్రజలకు అండగా నిలబడటమే ఆయన ప్రత్యేకత.
*‘ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు: తెలంగాణ సాధనలో మైలురాయి
జనసంఘ్, భారతీయ జనతా పార్టీల్లో కీలక పాత్ర పోషించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పునాదులను బలోపేతం చేయడంలో నరేంద్ర గారు విశేష కృషి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను జాతీయ స్థాయిలో గుర్తించేలా ‘ఒక ఓటు.. రెండు రాష్ట్రాలు’ అనే తీర్మానాన్ని పార్టీ ఆమోదించేలా చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు.
తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా భావించి, పదవులను సైతం తృణప్రాయంగా ఎంచి, సొంత పార్టీ విధానాలను విభేదించి బయటకు వచ్చారు. ‘తెలంగాణ సాధన సమితి’ని స్థాపించి, ఆపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో విలీనం చేసి తన రాజకీయ అనుభవాన్ని ఉద్యమానికి అంకితం చేశారు.
*చరిత్ర పుటల్లో చెరగని ముద్ర
భారతదేశ స్వాతంత్ర్యానికి ఏడాది ముందు జన్మించిన ఆలె నరేంద్ర గారు, ప్రత్యేక తెలంగాణ స్వప్నం సాకారమయ్యే కొద్దిరోజుల ముందే కన్నుమూశారు. ప్రజా సంక్షేమం, ప్రాంతీయ ఆకాంక్షల కోసం ఆయన చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.


