బడంగ్పేట్:
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ పరిధిలోని ప్రసిద్ధ దివ్యక్షేత్రం దేవతల గుట్ట స్వయంభూ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నూతన ముఖద్వారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, శాస్త్రోక్తంగా ముఖద్వారాన్ని ఆవిష్కరించారు.
*ఆధ్యాత్మిక వైభవం – స్వామివారి మహిమ
శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దేవతల గుట్ట ప్రాంతం ఎంతో ప్రాచీనమైనది మరియు విశిష్టమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు బడంగ్ పేట్ ప్రజలపై, రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఆకాంక్షించారు.
*క్షేత్ర అభివృద్ధికి నిరంతరం కృషి:
సనాతన ధర్మ పరిరక్షణకు, ఆధ్యాత్మిక కేంద్రాల పునరుద్ధరణకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని చిగురింత పారిజాత నరసింహారెడ్డి స్పష్టం చేశారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఇలాంటి దివ్యక్షేత్రాలను మరింత అభివృద్ధి చేయడానికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తన వంతు సహాయ సహకారాలు నిరంతరం అందిస్తానని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి, ప్రముఖులు కళ్ళెం నిరంజన్ రెడ్డి, నిరుడు శ్రీరాములు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


