- రూపాయి భారం లేకుండా బ్యాంకులతో సరికొత్త ఒప్పందం1
- 12.91 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు శాశ్వత భద్రత
- అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన ప్రకటన
హైదరాబాద్
దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్ల కుటుంబాలకు రూ.కోటి ప్రమాద బీమా రక్షణను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక క్షోభకు గురికాకూడదనే మహోన్నత లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. శాసనసభలో ప్రశ్నత్తరాల సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమగ్ర వివరాలను నిక్కచ్చిగా సభకు వెల్లడించారు. ప్రభుత్వ ఖజానా మీద గాని, ఉద్యోగుల జేబుల మీద గాని ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, జీతాలు జమచేసే బ్యాంకులతో సంప్రదింపులు జరిపి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని అమలు చేస్తున్నారు.
*పకడ్బందీ విధివిధానాలు.. విస్తృత ప్రయోజనాలు
రాష్ట్రవ్యాప్తంగా అట్టడుగు స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత ఉద్యోగుల వరకు మొత్తం 12,91,056 మందికి ఈ బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఇందులో 5,18,293 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, 5,00,158 మంది తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్, మల్టీపర్పస్ వర్కర్లు, కాంట్రాక్ట్, డైలీవేజ్, ఉపాధి హామీ, సెస్ సిబ్బంది ఉన్నారు. అలాగే 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు ఈ భద్రతను వర్తింపజేశారు. ఈ విధానానికి తొలుత సింగరేణి కాలరీస్‌లో అంకురార్పణ చేసి, ఆ తర్వాత విద్యుత్ శాఖ డిస్కమ్‌లకు, నేడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ విజయవంతంగా విస్తరించారు.
*క్షేత్రస్థాయిలో సత్వర పరిష్కారం
ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రాథమికంగా అందే రూ.కోటి బీమాతో పాటు, ఇతర ప్రయోజనాలు అదనంగా చేర్చి మొత్తం రూ.1.20 కోట్ల వరకు ఆర్థిక భరోసా దక్కుతుంది. విమాన ప్రయాణ సమయాల్లో జరిగే ప్రమాదాలకు రూ.2 కోట్ల వరకు పరిహారం అందేలా నిబంధనలు రూపొందించారు. సహజ మరణాలకు సైతం రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందే వెసులుబాటును కల్పించారు. ఇప్పటికే విద్యుత్ శాఖ పరిధిలో వచ్చిన అన్ని క్లెయిమ్‌లను పరిష్కరించి రూ.15 కోట్లకు పైగా చెల్లింపులు జరిపారు. సింగరేణిలోనూ వంద శాతం క్లెయిమ్‌లను పరిష్కరించగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న ఈ సరికొత్త బీమా విధానాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం ప్రత్యేకంగా అధ్యయనం చేయడం గమనార్హం.
*దశాబ్దాల కల సాకారం.. క్యాష్‌లెస్ వైద్య భరోసా
బీమా రక్షణతో పాటు ఉద్యోగులు, పెన్షనర్ల చిరకాల స్వప్నమైన క్యాష్‌లెస్ వైద్య సేవలను ప్రభుత్వం సాకారం చేసింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ప్యాకేజీల తరహాలో పకడ్బందీ వైద్య విధానాన్ని ఖరారు చేశారు. ఈ ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం రూ.240 కోట్ల భారీ నిధులను కేటాయించింది. ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక భరోసాను, ఆరోగ్య రక్షణను ఒకే వేదికపై అందించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది.


