లోక్ భవన్ నుండి జిల్లా రెడ్‌క్రాస్ శాఖలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర రెడ్‌క్రాస్ ఛైర్మన్ శ్రీ ఎం. దానకిశోర్
హైదరాబాద్
యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి అన్ని జిల్లాల్లో సమన్వయంతో కూడిన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ ఛైర్మన్ శ్రీ ఎం. దానకిశోర్, ఐఏఎస్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు, సోమవారం లోక్‌భవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లా రెడ్‌క్రాస్ శాఖల కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన నషా ముక్త్ భారత్ అభియాన్, టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల అమలుపై గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర రెడ్‌క్రాస్ ఛైర్మన్ శ్రీ ఎం. దానకిశోర్,
రాష్ట్ర రెడ్‌క్రాస్ శాఖ జనరల్ సెక్రటరీ, సీఈఓ ప్రొఫెసర్ ఎ. శ్రీరాములు తో కలిసి సమీక్షించి, పలు సూచనలు చేశారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ – జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు
నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారికంగా ప్రారంభించనున్నారని శ్రీ దానకిశోర్ తెలిపారు. దసరా అనంతరం జిల్లాలవారీగా అవగాహన ర్యాలీలు, విద్యాసంస్థల్లో సదస్సులు, పోస్టర్ ప్రదర్శనలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, ఇతర చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా రెడ్‌క్రాస్ శాఖలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ వాలంటీర్లతో పాటు జాతీయ సేవా పథకం (NSS), జాతీయ క్యాడెట్ దళం (NCC), స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని తెలిపారు. సంబంధిత విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో సమన్వయం చేసుకుని ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను నిరంతర అవగాహన ఉద్యమంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌క్రాస్ సభ్యత్వాన్ని గణనీయంగా పెంపొందించడంలో జిల్లా శాఖలు అందించిన సహకారాన్ని శ్రీ దాన కిషోర్ అభినందించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యత్వాల పెంపులోనూ సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, ఆయా సభ్యుల సేవలను రెడ్‌క్రాస్ కార్యక్రమాల్లో సముచితంగా వినియోగించుకోవాలని సూచించారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్ – బాధితులకు పౌష్టికాహార సహాయం
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా క్షయవ్యాధి బాధితులకు వైద్య చికిత్సతో పాటు అవసరమైన పౌష్టికాహార సహాయం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీ దానకిశోర్ సూచించారు. ఇందుకోసం జిల్లా రెడ్‌క్రాస్ శాఖలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు (DMHOలు), జిల్లా క్షయవ్యాధి నియంత్రణ విభాగాలు (District TB Units)తో సమన్వయం చేసుకుని, పౌష్టికాహార సహాయం అవసరమైన బాధితులను గుర్తించాలని తెలిపారు.
స్థానిక దాతలు, దాతృత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఇతర దాతల సహకారంతో అర్హులైన బాధితులకు పౌష్టికాహార కిట్లు లేదా తగిన ఆహార సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో లబ్ధిదారుల గుర్తింపు, పారదర్శకత, నిరంతర పర్యవేక్షణ, సంబంధిత వైద్య విభాగాలతో సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణలో రెడ్‌క్రాస్ పాత్ర
యువత సంక్షేమం, ప్రజారోగ్య పరిరక్షణ, సామాజిక చైతన్యం పెంపొందించడం వంటి అంశాల్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తన సేవలను మరింత విస్తరించాలని శ్రీ దానకిశోర్ తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్, టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు జిల్లా శాఖలు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, వాలంటీర్ల భాగస్వామ్యం, ప్రభుత్వ శాఖల సమన్వయం, దాతల సహకారం, కార్యక్రమాల పురోగతిపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా రెడ్‌క్రాస్ శాఖలు సంబంధిత ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లా రెడ్‌క్రాస్ శాఖల కార్యవర్గ సభ్యులు పాల్గొని, తమ జిల్లాల్లో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు.


