- తెలంగాణ పోలీస్ అకాడమీలో అట్టహాసంగా 112 మంది డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్.
- నేరాల తీరు మారుతున్నందున పోలీసింగ్ విధానంలోనూ సమూల మార్పులు రావాలి
- శిక్షణలో అద్భుత ప్రతిభ కనబరిచి సీ.ఎం రివాల్వర్ అందుకున్న నేహా అగర్వాల్
హైదరాబాద్ :
పోలీసు యూనిఫాం ధరించడం సామాన్యమైన విషయం కాదని, అది ఎంతో అదృష్టవంతులకే దక్కుతుందని రాష్ట్ర పోలీసు శాఖ ప్రధాన కార్యదర్శి (డీజీపీ) సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. తెలంగాణలోని కోట్లాది మంది జనాభాలో కేవలం వేల మందికి మాత్రమే ఈ గౌరవం లభించిందని తెలిపారు. సమాజంలో ప్రతిరోజూ కనీసం కొందరి కన్నీళ్లు తుడిచే అరుదైన అవకాశం కేవలం రక్షక భటులకే ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో సుదీర్ఘ శిక్షణ పూర్తి చేసుకున్న నూతన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీపీ సీవీ ఆనంద్ పరేడ్‌ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. 2014 తర్వాత పూర్తిస్థాయి శిక్షణ ముగించుకుని బయటకు వస్తున్న మొట్టమొదటి డీఎస్పీ బ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమంలో మొత్తం 112 మంది అధికారులు ప్రజా సేవలోకి అడుగుపెట్టారు.

నైతిక విలువలతో కూడిన వృత్తి జీవితం:
తొలుత చేసిన ప్రమాణం రాబోయే ముప్పై ఏళ్ల పాటు అధికారుల ఉద్యోగ జీవితానికి దిశానిర్దేశం కావాలని డీజీపీ పిలుపునిచ్చేశారు. రాజ్యాంగం పట్ల సంపూర్ణ నిబద్ధతతో, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లేదా రాగద్వేషాలకు తావులేకుండా విధులు నిర్వహించాలని హితవు పలికారు. ధైర్యం, దార్శనికత, నైతిక విలువలు, నిష్పాక్షికత, సాంకేతిక పరిజ్ఞానం వంటి పది కీలక లక్షనాలను ప్రతి అధికారి అలవర్చుకోవాలని సూచించారు.
మారుతున్న కాలానికి తగినట్లుగా పోలీసింగ్:
గతంలో నక్సలిజం వంటి సవాళ్లు ప్రధానంగా ఉండేవని, నాటి పోలీసులు వాటిని సమర్థంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, రోడ్డు భద్రతా సమస్యలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని తిప్పకొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్స్‌తో పాటు ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వంటి ప్రత్యేక విభాగాలను బలోపేతం చేసిందని వివరించారు. అధికారులు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక చురుకుదనాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ.. అత్యవసర సేవా నంబరైన 112 సంఖ్యతో ఈ బ్యాచ్‌కు ఉన్న అనుబంధాన్ని కొనియాడారు. ఈ 112 మందిలో 74 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కాలంలోనే కొందరు అధికారులు సివిల్స్ పరీక్షల్లోనూ ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు.
ప్రతిభావంతులకు పురస్కారాల ప్రదానం:
శిక్షణలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నేహా అగర్వాల్ అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్నారు. ఆమె ముఖ్యమంత్రి రివాల్వర్‌తో పాటు రాజా బహదూర్ వెంకట రామారెడ్డి బంగారు పతకం, కోన రామచంద్రారెడ్డి స్మారక బంగారు పతకం, హోంమంత్రి బేటన్లను అందుకున్నారు.
ఇతర విభాగాల్లో ప్రతిభ చూపిన వారిలో ఎల్. శ్రీకాంత్ (డీజీపీ ట్రోఫీ), టి. జాకబ్ అభిషేక్ (ఫైరింగ్ విభాగం), డి. చందన (ఫోరెన్సిక్ సైన్స్), చి. ఆది శేషు రెడ్డి (క్రిమినాలజీ), ఆర్. సాయి కిరణ్ రెడ్డి (దర్యాప్తు విభాగం) పురస్కారాలు పొందారు.
ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు, విశ్రాంత అధికారులు, నూతన అధికారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.



