*ఆగస్టు 2న దేశవ్యాప్తంగా ‘నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ – సంకల్ప్ అభియాన్’
*హైదరాబాద్:
భారతదేశాన్ని 2047 నాటికి మాదకద్రవ్య రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ‘నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ – సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ‘మై భారత్’ తెలంగాణ విభాగం ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ బృహత్తర ఉద్యమంలో భాగంగా… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని పది వేలకు పైగా కేంద్రాల నుంచి ఒక కోటికి పైగా యువతతో వర్చువల్ విధానంలో ప్రత్యక్షంగా సంభాషించనున్నారు. ఈ వేదికగా యువతతో మాదకద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించనున్నారు.
*రాష్ట్రంలో ప్రధాన వేదికలు
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రముఖ విద్యా సంస్థలను ఈ కార్యక్రమం కోసం వేదికలుగా ఎంపిక చేశారు.
*శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ,రంగారెడ్డి జిల్లా: సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్,సిద్ధిపేట: కావేరి విశ్వవిద్యాలయం,వరంగల్: వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల
వీటితో పాటు మరో ఐదు జిల్లాల్లో జిల్లా స్థాయి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, యువత భాగస్వామ్యంతో ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
సామూహిక ప్రతిజ్ఞ: మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని యువతతో ప్రత్యేక ప్రతిజ్ఞ. చైతన్య ర్యాలీలు: మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీలు.
*యువజన సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు: సమాజంలో మార్పును తెచ్చేలా ప్రత్యేక ప్రదర్శనలు.
ఈ కార్యక్రమం విజయవంతం కోసం జిల్లా యంత్రాంగం, విశ్వవిద్యాలయాలు, ఎన్.ఎస్.ఎస్. (NSS), ఎన్.సి.సి. (NCC), యువజన సంఘాలు, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలతో మై భారత్ తెలంగాణ విస్తృత సమన్వయం జరుపుతోంది.
*యువత భాగస్వామ్యంతోనే ప్రగతి: అన్వేష్
ఈ కార్యక్రమం గురించి ‘మై భారత్’ తెలంగాణ రాష్ట్ర సంచాలకులు చి. అన్వేష్ మాట్లాడుతూ… “ఇది కేవలం ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు, మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి యువశక్తిని ఏకం చేసే జాతీయ ఉద్యమం. తెలంగాణలోని ప్రతి యువకుడు, విద్యాసంస్థ, సామాజిక సంస్థ ఇందులో భాగస్వామ్యమై వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు నడుం బిగించాలి” అని పిలుపునిచ్చారు.


