అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: ఆర్.వి. కర్ణన్
హైదరాబాద్:
రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని అత్తాపూర్ సర్కిల్ నలంద నగర్, ‘ప్లాంట్ డాక్టర్స్ కాలనీ’లో పౌర మౌలిక సదుపాయాల స్థితిగతులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలోని కాలనీ పార్కు, అంతర్గత రహదారులను ఆయన పరిశీలించారు.
ఈ తనిఖీ సందర్భంగా పార్కులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పచ్చదనం, ఇతర ప్రజా సౌకర్యాల నిర్వహణ తీరును కమిషనర్ స్వయంగా పరిశీలించారు. నగరంలో పౌర మౌలిక సదుపాయాల నిర్వహణను సక్రమంగా చేపట్టాలని, చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజా వినియోగ ప్రదేశాల నాణ్యతను మరింత మెరుగుపరచాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్, అత్తాపూర్ డిప్యూటీ కమిషనర్ తదితర జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.


