Friday, October 30, 2026
Google search engine
Homeతెలంగాణవైవిధ్యం, చరిత్ర, సంస్కృతులపై అవగాహన పెంపొందించుకోవాలి

వైవిధ్యం, చరిత్ర, సంస్కృతులపై అవగాహన పెంపొందించుకోవాలి

  • విద్యార్థులు సాంస్కృతిక వారధులుగా నిలవాలి:
    తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపు
  • ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ లో భాగంగా అస్సాం విద్యార్థుల బృందంతో ముఖాముఖి

హైదరాబాద్

విద్యా పర్యటనలు కేవలం కొనుగోళ్లు, వినోదానికే పరిమితం కాకూడదని, పర్యటించే ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. పర్యటించిన ప్రాంతాల ప్రత్యేకతలను లోతుగా అధ్యయనం చేసి, ఆ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు.
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ – యువ సంగమం’ ఏడవ విడత కార్యక్రమంలో భాగంగా అస్సాం రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన 72 మంది సభ్యుల విద్యార్థుల బృందంతో లోక్‌భవన్ దర్బార్ హాల్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చార్మినార్ చారిత్రక ప్రాధాన్యం, గోల్కొండ కోట నిర్మాణంలోని అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలు, తెలంగాణ భాషా విశేషాలు, ఆహార అలవాట్లు, పండుగల విశిష్టతలను విద్యార్థులు నిశితంగా పరిశీలించాలని పేర్కొన్నారు. సమాజ శాస్త్ర, సాంస్కృతిక పరిశోధనల ప్రకారం మానవ సంబంధాల బలోపేతానికి, జాతీయ భావన పెరుగుదలకు ప్రత్యక్ష అనుభవాలు, పర్యటనలు ఎంతో దోహదపడతాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అక్టోబరు 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న ఈ పర్యటన కేవలం విహారయాత్ర కాదని, జ్ఞానాన్ని వికాసం చేసుకునే విశిష్ట అవకాశమని గవర్నర్ వర్ణించారు.

దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను పరస్పరం అర్థం చేసుకోవడమే ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ప్రధాన లక్ష్యమని గవర్నర్ వివరించారు. అస్సాం, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాల వైవిధ్యాన్ని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ చారిత్రక విశిష్టతను ఈశాన్య ప్రాంతాలకు పరిచయం చేసే సాంస్కృతిక రాయబారులుగా విద్యార్థులు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ విశిష్ట ఆలోచన దేశ సమగ్రతను, జాతీయ సమైక్యతను పటిష్టం చేస్తుందని తెలిపారు.
తెలంగాణలో తమ పర్యటన అనుభవాలను విద్యార్థులు సమావేశంలో వెల్లడించారు. ఇక్కడి ప్రజా ఆతిథ్యం, హైదరాబాద్ సాంకేతిక ప్రగతి తమను విశేషంగా ఆకట్టుకున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్, సహ కార్యదర్శి కొమండూరు శశికిరణ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయ సమన్వయ అధికారి డాక్టర్ ఎస్. అరుళ్మొజి, ఇతర అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments