రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో ఏసీబీ దాడులు..
తహసీల్దార్‌తో పాటు మండల సర్వేయర్ రవి కూడా అరెస్ట్
రెవెన్యూ కార్యాలయాల్లో లంచగొండితనం ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో ఒక మహిళా తహసీల్దార్, సర్వేయర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. భూమి రికార్డుల సవరణ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.50,000 తీసుకుంటుండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆమనగల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి తన అమ్మమ్మ పేరు మీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించడానికి, రికార్డులలోని తప్పులను సరిచేయడానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ పని పూర్తి చేయడానికి తహసీల్దార్ చింతకింది లలిత, మండల సర్వేయర్ కోట రవి కలిసి బాధితుడి నుంచి రూ.1,00,000 లంచం డిమాండ్ చేశారు.
ఇప్పటికే వారి ఒత్తిడితో బాధితుడు రూ.50,000 చెల్లించారు. మిగిలిన రూ.50,000 కోసం వారు వేధిస్తుండటంతో, బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. మంగళవారం తహసీల్దార్, సర్వేయర్ మిగిలిన రూ.50,000 లంచం తీసుకుంటుండగా వారిని పట్టుకున్నారు.


