సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘ ప్రసంగం..
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరణ..
హైదరాబాద్ : పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించిన “తెలంగాణ ప్రజాపాలన” దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ పోరాట చరిత్ర ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ఆయన అన్నారు.
‘‘సాయుధ పోరాటస్ఫూర్తితో నియంత పాలనను పక్కనబెట్టాం. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం మా పాలనలో ఉండదు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తుంది. ఉన్నత విద్యతో యువత భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తీసుకొస్తున్నాం. సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి స్ఫూర్తిదాయకులు’’ అని సీఎం పేర్కొన్నారు.
మహిళలు – రైతులు – విద్యార్థుల సంక్షేమం
మహిళల డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మార్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుల కోసం వినూత్న పథకాలను అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వారిని విస్మరించలేదని చెప్పారు. సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని గుర్తు చేశారు. సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఆర్థిక సాయం కల్పిస్తున్నామని ప్రకటించారు.
భూభారతి – పేదల ఆత్మగౌరవం
గత ప్రభుత్వ ‘ధరణి’ వ్యవస్థ వల్ల రెవెన్యూ రంగం దెబ్బతిన్నదని, తమ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చి సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
జల హక్కులపై దృఢమైన వైఖరి
కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కృష్ణా జలాల కోసం ట్రైబ్యునల్ ఎదుట 904 టీఎంసీల సాధనకు బలమైన వాదనలు వినిపిస్తామని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధి – ఫ్యూచర్ సిటీ
హైదరాబాద్‌ను ప్రపంచ గేట్‌వేగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకువస్తామని, మూసీ నది పక్కన నివసించే పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 9 లోగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.
డ్రగ్స్ నిర్మూలన – తెలంగాణ రైజింగ్ 2047
యువతకు శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. “మాదకద్రవ్యాలను అరికట్టడంలో మన పోలీసులు సత్తా చాటారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశాం. డిసెంబర్ 9న ప్రజలకు అందిస్తాం” అని ప్రకటించారు.
ఫ్యూచర్ సిటీ – రీజినల్ రింగ్ రోడ్
దేశానికి ఆదర్శంగా నిలిచే నగరం కోసం 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని, దీంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్‌తో పాటు 12 రేడియల్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


