- ప్రజా సంక్షేమానికి పెద్దపీట: ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం
- ప్రజలను ఇబ్బందిపెట్టే అధికారులపై కఠిన చర్యలు తప్పవు
- ప్రతి 45 రోజులకు పథకాల అమలుపై సమీక్షల నిర్వహణ అభివృద్ధికి నిధుల కొరత రానిచ్చేది లేదు: ఎమ్మెల్యే మల్ రెడ్డి స్పష్టీకరణ
ఇబ్రహీంపట్నం:
ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులందరికీ అందాలని, అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా సాగాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. అబ్దుల్లాపూర్మెట్, యాచారం మండలాల్లో నిర్వహించిన వరుస సమీక్షా సమావేశాల్లో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
శుక్రవారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్ మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఎమ్మెల్యే, మధ్యాహ్నం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు మరియు సర్పంచులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలుతీరు, గ్రామాల అభివృద్ధిపై ఆరా తీశారు. సర్పంచులు లేవనెత్తిన పలు సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. భూసమస్యలు, ఆక్రమణలు, అక్రమ అనుమతుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, కబ్జాలను సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
పుట్టి పెరిగిన ఊరు కావడంతో పేదల కష్టాలు తనకు పూర్తిగా తెలుసని మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. పేదల సంక్షేమం కోసమే తాను నిరంతరం అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. క్షేత్రస్థాయిలోనే అధికారులు సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని హితవు పలికారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రతి 45 రోజులకు తప్పనిసరిగా సమీక్ష జరగాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బందిపెట్టే అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ, ఇటీవల యాచారం మండలంలో ఒక అధికారి వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.
యాచారం మండలంలో భూసేకరణ ద్వారా నష్టపోయిన రైతులందరికీ పూర్తి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. పరిహారం పెంపు అంశంపై ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. గతంలో రైతులను అడ్డంపెట్టుకుని వసూళ్లకు పాల్పడిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం చెరువు సుందరీకరణ, ఆసుపత్రి నిర్మాణం, రోడ్ల అభివృద్ధి కోసం ఏకంగా 338 కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. అభివృద్ధికి నిధుల సమస్య తలెత్తకుండా చూసే పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
పదేళ్ల కాలంలో పనులు చేయలేని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, ఈ యజ్ఞంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



