- కోకాపేట్లో భారీ వాణిజ్య కమర్షియల్ నిర్మాణాలు: నిబంధనలకు పాతర
- *అక్రమ లేఅవుట్లు, వాణిజ్య దందాలతో ప్రభుత్వ ఆదాయానికి తూట్లు..
- ఏసీబీ దాడులను సైతం లెక్కచేయని టౌన్ ప్లానింగ్ మాఫియా!
- పూర్తిగా అవినీతిలో మునిగితేలుతున్న నార్సింగ్ మున్సిపల్ అధికారులు..
- టౌన్ ప్లానింగ్ అవినీతిని సపోర్ట్ చేస్తున్న:బిల్డ్ నౌ వెబ్సైట్ పారదర్శకత లోపం :
- సిఎంసి కమిషనర్ సృజన ఐఏఎస్ ఈ అవినీతిపై దృష్టి పెట్టాలంటూ స్థానిక ప్రజల విజ్ఞప్తి.
తెలంగాణలోనే రిచెస్ట్ మున్సిపాలిటీగా వెలుగొందిన నార్సింగి నేడు అధికారుల అక్రమాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది! కోకాపేట్లో నివాస భవనాలను కమర్షియల్ అడ్డాలుగా మారుస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టౌన్ ప్లానింగ్ మాఫియా కొల్లగొడుతోంది. ఏ.సీ.బీ దాడులు జరిగినప్పటికీ అధికారుల తీరులో ఏమాత్రం మార్పురాలేదు. “పైస్థాయికి మామూళ్లు చెల్లించాలి” అంటూ బరితెగించి వ్యవహరిస్తున్న ఈ బ్రోకర్ల దందాలపై సీ.ఎం.సీ కమిషనర్ సృజన ఐఏఎస్ గారు తక్షణమే కొరడాఝుళిపించి, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
*హైదరాబాద్:
రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయి. ఒకప్పుడు తెలంగాణలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తూ రికార్డు సృష్టించిన ఈ ప్రాంతం, నేడు అధికారుల అనామక నిర్ణయాలు మరియు అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నిబంధనలను గాలికొదిలేసి చేపడుతున్న అనధికార లేఅవుట్లు, భారీ అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం కొల్లగొట్టబడుతోంది. ప్రజాధనం కొల్లగొడుతూ అధికారుల జేబులు నింపుకుంటున్న ఈ దందాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
*నివాస భవనంలో కమర్షియల్ వ్యాపారాల జోరు..
గండిపేట్ మండలం, కోకాపేట్ గ్రామం పరిధిలోని నివాస (రెసిడెన్షియల్) అనుమతులతో నిర్మించిన ఒక భవనం పూర్తిగా అక్రమ వాణిజ్య కార్యకలామాలకు అడ్డాగా మారింది. సర్వే నెం. 165, ప్లాట్ నెం. 6 & 6/A లో ఉన్న సదరు భవనానికి కేవలం నివాస అవసరాల కోసం మాత్రమే అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేశారు.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నివాసం ఉండాల్సిన ఈ భవనాన్ని పూర్తిగా కమర్షియల్ కార్యాలయాలు మరియు వ్యాపార సంస్థల నిర్వహణకు అప్పగించారు. ఎలాంటి వాణిజ్య అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.

*అధికారుల మౌనం వెనుక మతలబు ఇదేనా?
*ఫిర్యాదులకు స్పందన శూన్యం:బాధితులు రాతపూర్వక ఫిర్యాదులు చేసినా, మీడియాలో వరుస కథనాలు వస్తున్నా అధికారుల్లో స్పందన కరవయింది. ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరితే తప్పుడు వివరాలు అందిస్తూ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
*భారీగా ట్రాఫిక్ నరకం: నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు సాగుతుండటంతో నిత్యం భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
*మార్ట్గేజ్ ఎగవేత మోసాలు: ఫైర్ సేఫ్టీ నిబంధనలకు తూట్లు పొడుస్తూ, మార్ట్గేజ్ ఎగవేత కోసం మోసపూరిత పనులకు పాల్పడుతున్నట్లు స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలున్నాయి.
*బిల్లు నౌ వెబ్సైట్లో పారదర్శకత లోపం: ఆన్లైన్ విధానంలో పారదర్శకత కొరవడటం అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులకు వరంగా మారింది.
*ముడుపుల మత్తులో టౌన్ ప్లానింగ్ యంత్రాంగం!
మీడియా ప్రతినిధులు వివరణ కోరితే అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. “పాపం టౌన్ ప్లానింగ్ అధికారులు ముడుపులు తీసుకుని, ఆ మామూళ్లను పైస్థాయి వరకు చెల్లించాలట!” అనే రీతిలో సాగుతున్న ఈ వ్యవహారం నార్సింగి మున్సిపాలిటీ పరువును బజారుకీడ్చింది. గతంలో ఇక్కడ ఇద్దరు ఉన్నతాధికారులు ఏసీబీకి చిక్కినప్పటికీ, అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గర్హనీయం.
*తక్షణమే స్పందించాలి: సీఎంసీ కమిషనర్ సృజన ఐఏఎస్ కు విజ్ఞప్తి
ప్రతిష్టాత్మక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) అంతర్భాగంగా ఉన్న నార్సింగి మున్సిపాలిటీపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
సీఎంసీ కమిషనర్ సృజన ఐఏఎస్ గారు తక్షణమే జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు భవనం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను తక్షణమే రద్దు చేయడంతో పాటు, అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై మరియు అక్రమాలకు పాల్పడిన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనియెడల ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని ఆధారాలతో రేపటి సంచికలో..



