- -త్యాగాల మూలాలపై పదవుల నీళ్లు..?
- -తెలంగాణ ఉద్యమకారుల ఆశల నెరవేరేనా..?
- లేక రాజకీయ చదరంగపు ఎత్తుగడనా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనేది కేవలం ఒక భౌగోళిక సరిహద్దుల మార్పు కాదు. అది కోట్ల మంది ఆకాంక్షల ప్రతిబింబం. దశాబ్దాల ఆత్మగౌరవ పోరాటం. ఆనాటి పాలకుల వివక్షకు వ్యతిరేకంగా, లాఠీ దెబ్బలను, తూటాలను ఎదురుచొచ్చి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల పునాదుల మీదే నేడు స్వరాష్ట్రం సాకారమైంది. కానీ, ఆ పోరాట ఫలితాన్ని అనుభవిస్తున్న పాలకుల నీడలో… ఆనాడు ముందుండి నడిపిన ఆ యోధుల గొంతుకలు నేడు ఎందుకు మూగబోతున్నాయి? ఎన్నికల హామీల గిమ్మిక్కులు, పదవుల ఎరలతో ఉద్యమ స్ఫూర్తిని ఎలా నీరుగారుస్తున్నారనే దానిపై విశ్లేషణాత్మక కథనం.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 'అభయ హస్తం' మేనిఫెస్టో ఉద్యమకారులకు భారీ ఆశలనే చూపింది.
*250 చదరపు గజాల ఇంటి స్థలం: ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ గుర్తింపునిచ్చి 250 గజాల స్థలం కేటాయిస్తామన్నారు.
*అమరవీరుల కుటుంబాలకు భరోసా: తొలి, మలి దశ అమరవీరుల కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, తల్లిదండ్రులకు లేదా భార్యకు నెలకు రూ. 25,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు.

*అక్రమ కేసుల ఎత్తివేత:
ఉద్యమ కాలంలో యువతపై బనాయించిన అక్రమ కేసులన్నీ బేషరతుగా ఎత్తివేస్తామని ప్రకటించారు.
- అధికారిక గుర్తింపు: ప్రతి ఏటా జూన్ 2న అధికారికంగా “తెలంగాణ ఉద్యమకారుడు” గుర్తింపు కార్డులు ఇస్తామని నమ్మబలికారు.
గత బీఆర్ఎస్ పాలనలో అమరుల త్యాగాలు విస్మరించబడ్డాయనే ప్రజా ఆగ్రహాన్ని సరిగ్గా అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ, ఉద్యమకారులను తమ వైపునకు తిప్పుకోవడానికి ఈ హామీలను అస్త్రంగా మలచుకుంది. ఎన్నికల్లో గెలుపు సాధించడంలో ఈ వాగ్దానాలు కీలక పాత్ర పోషించాయనేది కాదనలేని సత్యం.
*అర్జీల పర్వం… ఆ తర్వాత నిరాశే..!
ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఉద్యమకారుల సంఘాల నాయకులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై సర్కార్ దృష్టికి అర్జీలు సమర్పించారు:
- రూ. 25,000 నెలవారీ పింఛను మరియు 250 గజాల భూమి కేటాయింపు.
- ఉద్యమకారులపై ఉన్న అక్రమ కేసుల సంపూర్ణ ఎత్తివేత.
- మెరుగైన వైద్యం కోసం ఉచిత హెల్త్ కార్డులు.
- ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు రైల్వే పాసులు.
5.చట్టసభల్లో అన్ని పార్టీల ద్వారా ఉద్యమకారులకు 20% రాజకీయ రిజర్వేషన్లు. - ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో 20% సముచిత ప్రాతినిధ్యం.
*విమర్శనాత్మక కోణం: డిమాండ్ల పక్కనపెట్టి… పదవుల గాలమా?
ఉద్యమకారుల నుండి ఈ డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో, ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న వ్యూహంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమగ్ర చట్టం చేసి ఉద్యమకారులకు సంక్షేమ ఫలాలు అందించడానికి బదులుగా, సమస్యలను కాలయాపన చేసే ధోరణి కనిపిస్తోంది.
*పెద్దల దృష్టి మళ్లింపు: ప్రజా సమస్యలు, హామీల అమలుపై స్పష్టమైన విధివిధానాలు ( ప్రకటించకుండా, కేవలం కొన్ని సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలున్నాయి.
*నామినేటెడ్ పదవుల ఎర: ఉద్యమ డిమాండ్లను మూలన పడేసేందుకు, ఉద్యమ సంఘాలలోని కీలక నాయకులకు కొద్దిపాటి నామినేటెడ్ పదవులను ఎరగా చూపుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. అందరినీ ప్రశ్నించే గొంతుకలను పదవులతో కట్టడి చేయాలనే ఎత్తుగడ జరుగుతోందనేది ప్రధాన విమర్శ.
*త్యాగాల వాయిదా:
నిజమైన ఉద్యమకారులను అర్హుల జాబితా కిందకు చేర్చడంలో జరుగుతున్న జాప్యం, వారిని నిస్సహాయ స్థితిలోకి నెడుతోంది.
కేకే కమిటీ ఏర్పాటుతో ఉద్యమకారుల్లో ఆశలు చిగురించినా నాంచివేత ధోరణి నెలకొందనే విమర్శ లేకపోలేదు. ఏదేమైనా...తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు నేడు రోడ్డున పడి తమ హక్కుల కోసం అర్జీలు పెట్టుకునే దుస్థితి రావడం ప్రజాస్వామ్యానికి సరికాదు. ఎన్నికల వేళ ఓట్ల కోసం వాడుకున్న హామీలను రాజకీయ లబ్ధి కోసం కాకుండా, నైతిక బాధ్యతగా భావించి తక్షణమే అమలు చేయాలి.
పదవుల పంపకాలతో ఉద్యమ గొంతును నొక్కాలని చూస్తే, అది భవిష్యత్తులో తీవ్ర ప్రజా ఆగ్రహానికి దారితీసే ప్రమాదముంది. త్యాగధనుల ఆశల సాధన కోసం చేసిన పోరాటాలు… పదవుల లాలచీ రాజకీయాల బలైపోకుండా చూడాల్సిన బాధ్యత నేటి పాలకులపై ఉంది.



