*ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా ఆలయ కమిటీలకు నిధుల చెక్కుల పంపిణీ
ఎల్బీనగర్:
నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని దేవాలయ కమిటీలకు పారదర్శకంగా నిధులు మంజూరు చేసిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల వేడుకలను ప్రజలంతా ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయ కమిటీలకు మంజూరైన బోనాల ఉత్సవ నిధుల చెక్కులను సోమవారం చారిత్రాత్మక కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. మధుయాష్కి గౌడ్‌తో పాటు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోనాల పండుగ అనగానే తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, అరుదైన సాంప్రదాయాలు కండ్లముందు కదలాడుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్ర పండుగలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, దేవాలయాల అభివృద్ధికి మరియు ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులను విడుదల చేస్తోందని తెలిపారు. చెక్కుల పంపిణీకి ముందు నాయకులంతా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం అమ్మవారిని ప్రార్థించారు.
*కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, దేవాలయ ఈవో శోభన్ బాబు, ఆయా డివిజన్ల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, దేవాలయ కమిటీల మాజీ డైరెక్టర్లు, పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


