- శ్రీ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు!
- తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఆషాఢ బోనాలు…
- ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి.
మహేశ్వరం / బాలాపూర్:
సమస్త తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని బాలాపూర్ డివిజన్లో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభ మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని బాలాపూర్ డివిజన్లోని చారిత్రక శ్రీ పోచమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ శ్రీమతి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఘనంగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు.
అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖసంతోమలు వెల్లివిరియాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ నిత్యం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పరిపూర్ణంగా వర్ధిల్లుడమే కాకుండా, ప్రకృతి కటాక్షంతో వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ ప్రాంతం పాడిపంటలతో సుభిక్షంగా విలసిల్లాలని మనసారా ప్రార్థించినట్లు ఆమె ఉద్ఘాటించారు.
*శాస్త్రీయ, సాంప్రదాయ విశిష్టత:
భారతీయ సనాతన ధర్మంలో, విశేషించి దక్కన్ ప్రాంత పండుగలలో ఆషాఢ బోనాలకు అగ్ర తాంబూలం ఉంది. ప్రకృతిని, శక్తి స్వరూపిణి అయిన గ్రామ దేవతలను పూజించడం ద్వారా రుతుపవనాల ఆగమనం సందర్భంగా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు, సమాజ ఆరోగ్య పరిరక్షణకు పూర్వీకులు ఈ వేడుకలను శాస్త్రీయంగా నిర్దేశించారు. అంటువ్యాధుల నుంచి రక్షణ కోరుతూ శక్తి పీఠాలు, గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించే ఈ మహా ఉత్సవం భక్తి భావంతో పాటు సామాజిక ఐక్యతకు దిక్సూచిగా నిలుస్తోంది.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ దివ్య వేడుకల్లో మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి, ముఖ్య నాయకులు ఎర్ర జైహింద్, బాలింగని జంగయ్య, డివిజన్ అధ్యక్షులు నిరుడు శ్రీరాములు, టేకుల శశిధర్ రెడ్డి, తుళ్ళ నరహరి గౌడ్, గిరికటి కృష్ణంరాజు గౌడ్, పగడాల ఉమేష్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


