రాష్ట్రవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న భూమాఫియా: చెరువుల రక్షణకు హైడ్రా అస్త్రం అనివార్యం!
హైదరాబాద్:
మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి కదలివచ్చిన ప్రజా ప్రతినిధులు, పర్యావరణ వేత్తలు
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఘనంగా సంఘీభావం.. సర్వత్రా విస్తరించాలని డిమాండ్
వేగవంతమైన పట్టణీకరణ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విచ్చలవిడి భూ కబ్జాలు, చెరువుల అన్యాక్రాంతంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కబ్జాదారుల పీడ విరగడై, ప్రభుత్వ భూములు, జల వనరులు సురక్షితంగా ఉండాలంటే ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థను తక్షణమే రాష్ట్రవ్యాప్తం చేయాలని పలు జిల్లాల ప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ తరహా బలమైన యంత్రాంగం ఉంటేనే భవిష్యత్తు తరాలకు నీటి వనరులు మిగులుతాయని వారు స్పష్టం చేశారు.
ఇటీవల హైడ్రాపై జరుగుతున్న కుట్రలు, తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ.. నిజామాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు చెందిన ‘స్పీక్’ (SPEAK) సంస్థ ప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు హైదరాబాద్‌లో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

*శతాబ్దాల చరిత్ర కలిగిన జల వనరుల హననం
గత రెండు దశాబ్దాల క్రితమే ఈ వ్యవస్థ ఉనికిలోకి వచ్చి ఉంటే, నేడు మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారి గొలుసుకట్టు చెరువులు మాయమయ్యే దుస్థితి వచ్చేది కాదని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం భవనాల నిర్మాణం కోసమే వందల ఎకరాల చెరువులను, కుంటలను, ప్రభుత్వ భూములను, నాలాలను కబ్జా కోరల్లోకి నెట్టేస్తున్న కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపాలని కోరారు. తప్పుడు పత్రాలతో న్యాయస్థానాలను, ప్రభుత్వ శాఖలను తప్పుదారి పట్టిస్తూ వ్యవస్థలను శాసిస్తున్న భూ మాఫియాపై యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికారు.
*ముప్పు ముంచుకొస్తున్నా మారని వైనం: శాస్త్రీయ నివేదికల హెచ్చరిక
వాతావరణ మార్పులు, శాస్త్రీయంగా నిరూపితమైన కాలుష్య కారకాల ప్రభావంతో తెలంగాణ పట్టణాలు అక్షరాలా వరద ముంపునకు గురవుతున్నాయి. గత సంవత్సరంలో వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సంభవించిన విలయమే ఇందుకు నిదర్శనమని వారు గుర్తుచేశారు. సహజ సిద్ధమైన నీటి ప్రవాహ మార్గాలను (Drainage Basins) మూసివేయడం వల్లే స్వల్ప వర్షాలకే నగరాలు, పట్టణాలు జలమయం అవుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
చెరువులు, కుంటలు, వరద కాలువలను కబ్జాదారుల చెర నుంచి విడిపించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచితేనే ఈ ముప్పును తిప్పికొట్టగలమని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా, భవిష్యత్తులో జల ప్రళయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే హైడ్రా లాంటి కఠినమైన చట్టబద్ధమైన యంత్రాంగం ప్రతి జిల్లాకు అత్యంతావశ్యకమని తేల్చిచెప్పారు.
*ప్రజా ఆస్తుల రక్షణకు సింహస్వప్నం కావాలి
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో హైడ్రా తరహా వ్యవస్థ అందుబాటులోకి వస్తేనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని, ప్రజా ఆస్తులను దోచుకునే వారికి చట్టంపై భయం పుడుతుందని వక్తలు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం మరింత బలమైన, రాజీలేని చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. ప్రజాధనాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడే ఈ మహోద్యమానికి రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉంటారని స్పష్టం చేశారు.



