ఎల్బీనగర్:
అఖిలభారత శరీర అవయవదాతల సంఘం నిర్వహిస్తున్న అవయవదాన పక్షోత్సవాల్లో భాగంగా, ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రా లేఅవుట్ పార్క్, ఎల్బీనగర్లో పెద్ద ఎత్తున అవయవదాన అవగాహన ర్యాలీ, సదస్సు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎస్. రామచంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసి రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ డా. వి. కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అవయవదాన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలను కదిలించిన అవయవదాన సందేశం
చిత్రా లేఅవుట్ నివాసితులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆత్మీయంగా స్వాగతించడమే కాకుండా, అవయవదానంపై అందించిన సందేశాలకు విశేషంగా స్పందించారు. అవయవదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ, మరణానంతరం మన అవయవాలు మరొకరికి ప్రాణదానం చేయగలవనే మానవతా సందేశం కార్యక్రమంలో ప్రతిధ్వనించింది.ఈ సందర్భంగా పలువురు స్థానిక పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవయవదానం చేయడానికి నిర్ణయం తీసుకోవడం, అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
“మరణించినా జీవించండి” — స్ఫూర్తిదాయక సందేశం
అఖిలభారత శరీర అవయవదాతల సంఘం నేషనల్ కో-కన్వీనర్ ఎల్.వి. ప్రసాద్, నేషనల్ కో ఆర్డినేటర్ సొంటె శ్రీనివాస్ అందించిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. అవయవదానం అనేది కేవలం ఒక దానం కాదని, ఒకరి మరణం తర్వాత మరొకరికి జీవితాన్ని అందించే మహాదానం అని ఆయన వివరించారు. ప్రతి కుటుంబంలో అవయవదానంపై చర్చ జరగాలని, ప్రతి ఒక్కరూ అవయవదానంపై సరైన సమాచారాన్ని తెలుసుకుని ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో “అవయవదానం – మహాదానం”, “మరణించినా జీవించండి”, “మీ అవయవాలు మరొకరికి జీవితం కావచ్చు” వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అవయవదానం ఒక సామాజిక ఉద్యమంగా మారాలని పునరుద్ఘటించారు.ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ గవర్నర్ బి. గంగాధర్ రెడ్డి, చిత్రా లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, వాకర్స్ క్లబ్ చిత్రా లేఅవుట్ అధ్యక్షులు జీ. మధుసూదన్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, చిత్రా లేఅవుట్ అధ్యక్షులు ఆర్ఎల్ నర్సింహా రెడ్డి, నల్గొండ హైట్స్ అధ్యక్షులు టీ.జగదీశ్ రెడ్డి, జాలీ వాకర్స్ క్లబ్, చిత్రా లేఅవుట్‌కు చెందిన డా. సీఆర్ఎం రావు, చిత్రా లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోద కృష్ణా రెడ్డి పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు సైతం కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ అవయవ దాతల సంఘం గౌరవాధ్యక్షులు అనురుద్రా రెడ్డి, జయశ్రీ, ఉపాధ్యక్షులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.



