Wednesday, September 2, 2026
Google search engine
Homeతెలంగాణగ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌ గా హైదరాబాద్‌:

గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌ గా హైదరాబాద్‌:

  • ‘తెలంగాణ రైజింగ్‌’కు చరిత్రాత్మక ముందడుగు
  • విద్యా రంగానికి మహర్దశ: అమెరికా, బ్రిటన్‌ల ఉద్ధృత విశ్వవిద్యాలయాలతో చారిత్రక ఒప్పందాలు
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో నవశకానికి అంకురార్పణ

హైదరాబాద్:

దేశ పారిశ్రామిక, సాంకేతిక రాజధానిగా విరాజిల్లుతున్న హైదరాబాద్‌ ఇప్పుడు అక్షర ప్రపంచంలోనూ శిఖరాగ్రానికి చేరుకుంటోంది. ప్రపంచాన్ని శాసించే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, మేధో కేంద్రాలను భాగ్యనగరానికి రప్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అమెరికా, బ్రిటన్‌ దేశాలలో సాగిన ఉన్నతస్థాయి పర్యటన అద్భుత ఫలితాలను సాధించింది. కేవలం వాణిజ్య రాజధానిగానే కాక, రాబోయే తరాల మేధో సంపత్తికి హైదరాబాద్‌ను తిరుగులేని గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దే సంకల్పంతో ఈ పర్యటన సాగింది. ప్రభుత్వ సమర్థ నాయకత్వం, దార్శనిక విధానాల ఫలితంగా అంతర్జాతీయ విద్యారంగంలో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది.

*అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల రాక.. ఆఫ్‌షోర్‌ కేంద్రాల ఏర్పాటు
సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, రక్షణ మరియు ఏరోస్పేస్‌ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హైదరాబాద్‌.. ఇప్పుడు అత్యున్నత విద్యారంగానికి కేంద్ర బిందువుగా మారుతోంది. అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ’ మరియు ఇంగ్లండ్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల అత్యున్నత సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌’ భారత్‌లో తమ మొట్టమొదటి ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లను హైదరాబాద్‌లోనే నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక ‘భారత్‌ ఫ్యూచర్‌ సిటీ’లో నార్త్‌ ఈస్టర్న్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండగా, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ కూడా తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

*ఎల్‌ఎస్‌ఈ, ఎస్‌ఓఏఎస్‌ల భాగస్వామ్యం.. హార్వర్డ్‌ కోర్సుల ప్రవేశం
ప్రపంచ ఆర్థిక శాస్త్రానికి దిశానిర్దేశం చేసే ప్రఖ్యాత ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ (LSE) మరియు ‘స్కూల్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ అండ్‌ ఆఫ్రికన్‌ స్టడీస్‌’ (SOAS) ప్రతినిధులతో తెలంగాణ ఉన్నతస్థాయి బృందం జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ విద్యా కేంద్రాల స్థాపన, పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యా ప్రణాళికల రూపకల్పన, అత్యాధునిక బోధనా పద్ధతుల అవలంబనపై స్పష్టమైన ఒప్పందాలు కుదిరాయి.
అంతేకాకుండా, ప్రపంచ ప్రఖ్యాత ‘హార్వర్డ్‌ యూనివర్సిటీ’కి చెందిన స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్ కోర్సులు ఇకపై హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాల కోసం నవంబర్‌ నెల నుంచే ఈ ప్రత్యేక తరగతులు ప్రారంభంకానుండటం గమనార్హం. ఇటు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో సంయుక్త పరిశోధనా కేంద్రాలు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుపై కూడా సర్థవంతమైన చర్చలు కొలిక్కివచ్చాయి.

*‘ట్రిలియన్ డాలర్ల’ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
2047 నాటికి తెలంగాణను త్రి-ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల మధ్యంతర లక్ష్యంగా సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నాలెడ్జ్‌ హబ్‌ల ఏర్పాటు ద్వారా రాష్ట్ర యువతకు స్థానికంగానే ప్రపంచ స్థాయి విద్యా ప్రమాడాలు, నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయి. విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలను ఒకే వేదికపైకి తెస్తూ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తుండటం ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

*నైపుణ్యాల రూపకల్పన.. ఉపాధి అవకాశాల జోరు
రాష్ట్రంలో మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే విద్య, నైపుణ్యాలు, క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా రూపాంతరం చెందుతున్న ఐటీఐలు, స్కిల్స్ యూనివర్సిటీల ద్వారా స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌ల ఏర్పాటుతో మరిన్ని బహుళజాతీయ కంపెనీలు, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లు రాష్ట్రానికి తరలివచ్చి, తయారీ రంగం అపూర్వమైన వృద్ధిని సాధించనుంది.

*డిసెంబర్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ట్రాక్
రాబోయే డిసెంబర్‌ 7, 8, 9 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’లో ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, క్రీడా మౌలిక వసతుల కల్పనపై ఒక ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యా విప్లవం, పారిశ్రామిక ప్రగతి జోడెడ్లలా సాగుతున్న ఈ ప్రయాణం.. తెలంగాణను దేశానికే తలమానికమైన శక్తివంతమైన ఆర్థిక మరియు మేధో కేంద్రంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments