రూ. 25 కోట్లతో కళాక్షేత్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలత: మధుయాష్కి గౌడ్
ఎల్బీనగర్:
వనస్థలిపురం గడ్డపై కళా సౌరభాలు వెదజల్లాయి. ఎస్.కె.ఎన్ కళాక్షేత్రం ఆధ్వర్యంలో వనస్థలిపురం రైతు బజార్ సమీపంలోని పార్కు ప్రాంగణంలో నిర్వహించిన సంగీత నృత్యరూపక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 150 మంది చిన్నారులు ప్రదర్శించిన ప్రతిభావంతమైన కళా రూపాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఈ మహత్తర సాంస్కృతిక వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ, తూర్పు ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయని తెలిపారు. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక రవీంద్ర భారతి వేదిక తరహాలోనే వనస్థలిపురంలో కూడా రూ. 25 కోట్ల భారీ వ్యయంతో అత్యాధునిక హంగులతో ఆడిటోరియాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదన పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, తద్వారా త్వరలోనే నిధులు మంజూరయ్యేలా ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేటి తరం యువతలో, చిన్నారుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని పునరుద్ఘాటించారు. తమ అద్భుతమైన నృత్య, సంగీత విన్యాసాలతో ఆహూతులను మంత్రముగ్ధులను చేసిన చిన్నారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సాంస్కృతిక కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, వివిధ డివిజన్ల అధ్యక్షులు కొల్లూరు శ్రీనాథ్, గోపి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రమాకాంత్ గుప్తా, డివిజన్ మాజీ అధ్యక్షులు కుట్ల నరసింహ యాదవ్, మకుటం సదాశివుడు పాల్గొన్నారు. అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొండోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు స్వర్ణ మాధవి, డేరంగుల కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దాము మహేందర్ యాదవ్, కార్యదర్శులు రిజ్వాన్, నరేష్ గుప్తా, నాయకులు శశికాంత్, ఇర్ఫాన్ తదితరులు ఉపస్థితులై ఉన్నారు. కార్యక్రమ నిర్వహణను డాక్టర్ సూలాపాణి, వెంకటాచార్య విజయవంతంగా పర్యవేక్షించారు.



