చెరువుల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న హైడ్రా: కమీషనర్ ఏ.వీ రంగనాథ్ స్పష్టీకరణ.
హైదరాబాద్:
వేగవంతమైన పట్టణీకరణ దేశంలోని నగరాలను పెను ప్రమాదాల వైపునకు నెడుతోంది. సహజ నీటి వనరులు కబ్జాలపాలవుతుండటంతో, ఎడతెరిపి లేని వర్షాలకు మహానగరాలు జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు యువత సైతం భాగస్వామ్యం కావాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు.
నాగోలులోని హైడ్రా శిక్షణ కేంద్రంలో గురువారం ‘యువ ఆపద మిత్ర’ ఐవవ బ్యాచ్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు.
*69 శాతం చెరువులు కబ్జా: ఎన్ఆర్ఎస్సీ నివేదిక
నగరంలో సుమారు 69 శాతం చెరువులు అన్యాక్రాంతమైనట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంట్రి (ఎన్ఆర్ఎస్సీ) ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమైందని కమిషనర్ తెలిపారు. చెరువులను, నాలాలను పరిరక్షించడం ద్వారా మాత్రమే వరద ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చని చెప్పారు. కేవలం ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ ద్వారా అసలు ముప్పు రాకుండా చూడటమే హైడ్రా ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే నాలాలు, చెరువుల పునరుద్ధరణ చేపట్టిన కొన్ని ప్రాంతాలలో వరదలను విజయవంతంగా కట్టడి చేసినట్లు ఆయన గుర్తుచేశారు.

*మానవ తప్పిదాలతోనే పెను ముప్పు
నగరంలో విచ్చలవిడిగా వెలుస్తున్న అనధికార, అక్రమ కట్టడాలు భూకంపాల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం యాభై గడల స్థలంలో ఏడెనిమిది అంతస్తుల భవనాలు నిర్మించడం వల్ల చుట్టుపక్కల నివాసాల ప్రజలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందన్నారు.
ఇటీవల గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటనను, గతంలో సిద్ధిఖ్‌నగర్‌లో భవనం పక్కకు వరిగిన ఘటనలను ఆయన ఉదాహరించారు. ఇవన్నీ కేవలం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్న కృత్రిమ వైపరీత్యాలని ఆయన పేర్కొన్నారు.
*యువత భాగస్వామ్యంతోనే సఫలత
చదువుతో పాటు సమాజ సేవ చేయాలనే సత్సంకల్పంతో ముందుకు వచ్చిన వాలంటీర్లను కమిషనర్ అభినందించారు. ఐదవ బ్యాచ్‌లో శిక్షణ పొందుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 117 మంది కళాశాల విద్యార్థులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న యువత, ఏదైనా ప్రమాదం పొంచివున్నప్పుడు వెంటనే స్పందించి ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేయాలని, నష్ట నివారక చర్యల్లో ముందుండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్లు శ్రీ ఆర్. సుదర్శన్, శ్రీ డి. ఆనంద్ కుమార్, ఏడీఎఫ్‌వో శ్రీ మోహన్ రావు, ఆర్ఎఫ్ఓ శ్రీ జయప్రకాశ్, డీఎఫ్ఓలు శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ గౌతమ్, మై భారత్ జిల్లా యువజన అధికారి శ్రీ శశాంక్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధికారిణి గ్రీష్మ చంద్రిక తదితరులు పాల్గొని యువతకు తగిన సూచనలు అందజేశారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరంలో వాలంటీర్లకు విపత్తు నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యాలను నేర్పించనున్నారు.


