- రాష్ట్రంలో పదేళ్ల లక్ష్యంగా పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
- ఉమ్మడి జిల్లాకో ప్రాసెసింగ్ యూనిట్.. అక్టోబరు నాటికి ఆయిల్ ఫెడ్ నియామకాలు పూర్తి.
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నత స్థాయి సమీక్షలో కీలక నిర్ణయాలు.
హైదరాబాద్:
ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో ముప్పు పొంచివున్న క్లిష్ట సమయాల్లో అన్నదాతలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. సంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతాంగాన్ని లాభసాటి ఉద్యాన పంటల వైపు మళ్లించేలా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యాన శాఖ అలాగే ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ రంగ భవిష్యత్తుకు బాటలు వేసే పలు చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు.
*ఉద్యాన రంగానికి మహర్దశ.. పెరుగుతున్న విస్తీర్ణం
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండటం శుభపరిణామమని మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. గత కాలంతో పోలిస్తే సుగంధ ద్రవ్యాల సాగు 65 శాతం, ఎర్రమిరప సాగు 83 శాతం, ఇతర మసాలా దినుసులు 192 శాతం, పూల సాగు ఏకంగా 198 శాతం వృద్ధి చెందడంపై అధికారులను అభినందించారు. ఈ జోరును మరింత వేగవంతం చేసి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని స్పష్టం చేశారు.
*ఇతర రాష్ట్రాలకు మన కూరగాయల ఎగుమతులు
స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా, తెలంగాణ కూరగాయలను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసే సమున్నత స్థాయికి ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇందుకోసం రైతులకు అత్యుత్తమ నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించాలని, డిమాండ్‌కు తగినట్లుగా పకడ్బందీ మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు.
పదే లక్షల ఎకరాల లక్ష్యంగా ఆయిల్ పామ్ విప్లవం
భారతదేశ వంటనూనె దిగుమతులను తగ్గించడమే ధ్యేయంగా రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ఉధృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా అనుకూల భూములు ఉండగా, ప్రథమ దశలో కనీసం 10 లక్షల ఎకరాల్లో సాగు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.
- ప్రతి ఏటా కనీసం రెండు లక్షల ఎకరాల్లో కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి.
- ఆయిల్ పామ్ గెలల ధరలు నిలకడగా పెరుగుతున్నందున, రైతుల డిమాండ్‌కు తగినట్లు నర్సరీల్లో ముందుగానే నాణ్యమైన మొక్కలను సిద్ధం చేయాలి.
- లక్ష్య సాధనలో విఫలమై నిర్లక్ష్యం ప్రదర్శించే కంపెనీల జిల్లా కేటాయింపులను రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని మంత్రి స్పష్టం చేశారు.
*ఉమ్మడి జిల్లాకో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ
రైతులు పండించిన పంటకు వెంటనే గిట్టుబాటు ధర దక్కేలా ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని యూనిట్ల పనులను వేగవంతం చేసి, రాబోయే సంక్రాంతి పండుగ నాటికి వాటిని పూర్తిస్థాయిలో ప్రారంభించాలని స్పష్టం చేశారు.
*కోకో సాగుకు ప్రోత్సాహం – ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు
ఆయిల్ పామ్ తోటల్లో అంతరపంటగా కోకో సాగు చేస్తున్న రైతులు అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కోకో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తొలివిడతగా అశ్వారావుపేట అలాగే దమ్మపేట ప్రాంతాల్లో ప్రత్యేక కోకో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
యంత్రీకరణకు ఒకే గొడుగు కింద నోడల్ ఏజెన్సీ
రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను వేగంగా అందించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వ్యవసాయ మరియు ఉద్యాన శాఖల్లో వేర్వేరుగా అమలవుతున్న యాంత్రీకరణ పథకాలను ఇకపై ఒకే ఏకీకృత నోడల్ ఏజెన్సీ ద్వారా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
*ఆయిల్ ఫెడ్లో ఉద్యోగ నియామకాల వేగం:
లక్ష్యాలను సాధించడంలో సిబ్బంది కొరత అడ్డుకాకూడదని భావించిన మంత్రి, ఆయిల్ ఫెడ్లో ఖాళీల భర్తీ ప్రక్రియను అత్యవసరంగా చేపట్టాలని ఆదేశించారు. అక్టోబరు నెలాఖరులోగా ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసి, రాబోయే రెండు మూడు నెలల్లో నియామకాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ అత్యున్నత సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్, ఉద్యాన శాఖ మేనిజింగ్ డైరెక్టర్ మరియు ఆయిల్ ఫెడ్ మేనిజింగ్ డైరెక్టర్ యాస్మిన్ బాషా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



