Friday, October 30, 2026
Google search engine
Homeతెలంగాణ‘ఫ్యూచర్’ లేని ‘క్యూర్’?– అధికారుల ఎంపికలో ఘోర వైఫల్యం!

‘ఫ్యూచర్’ లేని ‘క్యూర్’?– అధికారుల ఎంపికలో ఘోర వైఫల్యం!

  • – ముఖ్యమంత్రి స్వప్నంపై కమ్ముకుంటున్న కారుమబ్బులు!
  • – తక్షణమే అసమర్థ అధికారులను సాగనంపి, సమర్థులకు పగ్గాలు ఇవ్వాలి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘క్యూర్’, ‘ఫ్యూచర్ సిటీ’ డ్రీమ్ ప్రాజెక్టులు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల మూలనపడే ప్రమాదంలో పడ్డాయి. హెచ్ఎండిఏ, జలమండలి, జిహెచ్ఎంసి, ఎం. ఎం.సి, సిఎంసి వంటి కీలక శాఖల్లో సమన్వయ లోపం, ప్రజాధనం దుర్వినియోగం కావడం వల్ల అభివృద్ధి కుంటిపడింది. అధికారులు పారదర్శకతను విడనాడి స్వార్థంతో వ్యవహరిస్తుండటంతో పారిశుద్ధ్యం, రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అసమర్థులను సాగనంపి, నిబద్ధత కలిగిన సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తేనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఆశయం సాకారమవుతుంది.

ప్రజల ఆదరణ చూరగొని, ‘క్యూర్’ (CURE) తో పాటు ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయం అటకెక్కే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వ అత్యున్నత డ్రీమ్ ప్రాజెక్టులుగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాంతాల అభివృద్ధిలో సంబంధిత శాఖల అధికారులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ఈ అత్యంత కీలకమైన ప్రాంతాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల సామర్థ్యంపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శాఖల మధ్య లోపించిన సమన్వయం:
ప్రధానంగా జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏ, మెట్రో రైల్ సంస్థల పనితీరుపైనే క్యూర్, ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంది. ఈ కీలక స్థానాల్లో విధులు నిర్వర్తించే ఉన్నతాధికారులు ప్రాంతీయ అభివృద్ధిపై చిత్తశుద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పారదర్శకత, జవాబుదారీతనం కలిగి ఉండాలి. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే జీతభత్యాలు అందుకుంటున్నామనే స్పృహ వారిలో ఉండాలి.

ప్రజాధనం లూటీయే ధ్యేయమా?
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. సివిల్స్ ఉద్యోగం సాధించామన్న అహంకారం, కాలక్రమేణా వచ్చే పదోన్నతుల ధీమాతో కొందరు అధికారులు ప్రజాధనాన్ని లూటీ చేయడమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నారు. “ఎంత వెనకేసుకుంటున్నాం? మన జీవితాలకు ఇది చాలు” అనే స్వార్థపూరిత ధోరణితో క్యూర్, ఫ్యూచర్ సిటీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

అవినీతికి నిలయాలుగా హెచ్‌ఎండీఏ, జలమండలి!
గడిచిన మూడేళ్ల కాలంలో ఈ అధికారుల పనితీరును పరిశీలిస్తే వీరికి లభించేది కేవలం సున్నా మార్కులే. నేడు హెచ్‌ఎండీఏ, జలమండలి విభాగాలు అవినీతికి నిలయాలుగా మారాయి. ఈ రెండు శాఖలపై కూలంకషంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే అక్షర సత్యాలు, విస్మయపరిచే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇక జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా తయారైంది. పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి, రోడ్లు అధ్వాన్నంగా మారి, మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. పెరిగిపోయిన అవినీతి, బంధుప్రీతి, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ, అందులో సగం నిధులు పక్కదారి పడుతున్నాయి.

*అడుగడుగునా వైఫల్యాలే!
అభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలోనూ అధికారుల పాత్ర శూన్యంగానే మిగిలింది. నేటికీ ప్రజలు ప్రైవేట్ సంస్థల సేవలను స్మరించుకుంటున్నారే తప్ప, ఈ శాఖల అధికారులు చేస్తున్న మేలు ఏమిటంటే సమాధానం శూన్యం. మరోవైపు విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలు కూడా అత్యంత కీలకంగా మారి, ప్రజలకు భారంగా పరిణమించాయి.

*సమర్థులకు బాధ్యతలు ఇస్తేనే ఆశయం సాకారం!
ఈ వైఫల్యాల పరంపరను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి, స్వప్నం సాకారం కావాలంటే నిరుపయోగంగా మారిన అధికారులను తక్షణమే తొలగించాలి. ప్రజల సంక్షేమం, ప్రాంత సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా నిబద్ధత కలిగిన సమర్థులైన అధికారులను రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. లేనియెడల ప్రజా ఆగ్రహానికి పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments