అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన టీజీ ఆర్డీసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్:
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం–2026 కార్యక్రమం ఈ నెల 18న ఘనంగా ప్రారంభం కానుంది.బీఎన్ రెడ్డి నగర్, సాగర్ రోడ్డులో ఉన్న గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు టీజీఆర్డీసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించారు. కార్యక్రమ నిర్వహణ, మొక్కలను నాటే ప్రదేశాలు, వేదిక ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పార్కింగ్ సౌకర్యాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డిఎఫ్ఓ రోహిత్ రెడ్డి ఐఎఫ్ఎస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, వనస్థలిపురం సర్కిల్ ఇన్స్ పెక్టర్ రవిబాబు, ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు.వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా విజయవంతం చేయాలని, ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పెంచి సంరక్షించడం ద్వారా పచ్చని తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చంపాపేట్ డివిజన్ అధ్యక్షులు దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, గడ్డిఅన్నారం ఏఎంసీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి, నాయకులు మెరుగు రమేష్ రెడ్డి, వినయ్ పటేల్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.


