పటాన్‌చెరు:
మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యువతకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.
బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో నషా ముక్తి భారత్ అభియాన్, బ్రాహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. పాఠశాల, కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..
యువత దేశ భవిష్యత్తు అని, వారిని మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, సామాజిక సంస్థలు, ప్రజలందరిపై ఉందని అన్నారు.
డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్తు కూడా తీవ్రంగా దెబ్బతింటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం నేరాలు, హింస, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించి తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి విద్యాసంస్థ డ్రగ్స్ రహిత ప్రాంతంగా మారాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజయ్ కుమార్, బాల్ రెడ్డి, నర్రా బిక్షపతి, అశోక్, హనుమంత్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, పృథ్వీరాజ్, బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



