ఏసీబీకి దొరికిన అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్, మండల సర్వేయర్
ఎల్బీనగర్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల తహసిల్దార్, మండల సర్వేయర్ లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు, తహాసిల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఇరువురిని ఏసీబీ, సిఐయు అధికారులు పట్టుకున్నట్లు ఏసీబీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్ఎండిఏ మార్గదర్శకాల ప్రకారం లేఅవుట్ కు సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే నివేదిక జారీ చేయడానికి ఫిర్యాదుదారుడు నుంచి రెవెన్యూ అధికారులు తొలుత 30 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని 20 లక్షలకు తగ్గించారు. ఈ క్రమంలో నిన్న అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఫిర్యాదుదారుడు నుండి 20 లక్షల రూపాయలు లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు సర్వే శ్రీనివాసులు పట్టుకున్నారు. తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి సూచనల మేరకే ఈ లంచం డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సర్వేయర్ వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, వారు నిర్వహించిన రసాయన పరీక్షల్లో ఆయన రెండు చేతుల వేళ్ళకు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ ఇద్దరు అధికారులు తమ విధులను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి నాంపల్లిలో ఉన్న ఎస్పిఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తులో ఉందని ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్టా వెల్లడించడం లేదని ఏసీబీ వర్గం పేర్కొంది.



