- ప్రజలకు గవర్నర్ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.
1948 సెప్టెంబరు 17వ తేదీ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భమని గవర్నర్ పేర్కొన్నారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణతో పాటు మరాఠ్వాడా, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలు ఉండేవని గుర్తుచేశారు.
విమోచన ఉద్యమంలో ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలను కృతజ్ఞతతో స్మరించుకోవాలని, విమోచన యోధులకు నివాళులర్పించాలని ఆయన అన్నారు. ఈ చారిత్రక ఘట్టం, నాటి ప్రజల త్యాగాల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
‘‘విమోచన యోధుల ధైర్యం, త్యాగం మనకు స్ఫూర్తిదాయకం. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యత, సమగ్రత విలువలను పరిరక్షిస్తూ ముందుకు సాగాలి’’ అని గవర్నర్ అన్నారు.
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఐక్యతా భావంతో నిర్వహించి, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు శాంతి, ప్రగతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.


