- *యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు
- *ఏటీసీల్లో ఈవీ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులకు అత్యంత ప్రాధాన్యం
- *అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నర్సింగ్ కళాశాలల మంజూరు
- *శక్తి శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు
*హైదరాబాద్:
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే యువతకు పాస్‌పోర్టు జారీ నుంచి ఉద్యోగ భద్రత కల్పించే వరకు పూర్తి స్థాయి బాధ్యతను ‘టామ్‌కాం’ (TGCEL)తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శక్తి శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఉత్తర తెలంగాణ నుంచి ఉపాధి కోసమ మధ్య ప్రాచ్య (గల్ఫ్) దేశాలకు వలస వెళ్లే కార్మికులు అనధికారిక ఏజెంట్ల చేతిలో మోసపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉదంతాలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికుల రక్షణే ధ్యేయంగా టామ్‌కాం విధివిధానాలను బలోపేతం చేయాలని ఆదేశించారు.
*టామ్‌కాం బాధ్యతలు – విదేశీ ఉపాధికి భరోసా
*ప్రత్యేక ఒప్పందాలు: ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్‌పోర్టులు ఇప్పించడంతో పాటు, ఆయా దేశాల్లోని ప్రధాన మ్యాన్‌పవర్ కంపెనీలతో టామ్‌కాం అధికారిక ఒప్పందాలు చేసుకోవాలి.
*చట్టపరమైన రక్షణ: విదేశీ కంపెనీలతో ఒప్పందాలు ఉండటం వల్ల అక్కడికి వెళ్లిన కార్మికులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే చర్చలు జరపడానికి, వారికి న్యాయం చేయడానికి సులభతరమవుతుంది.
*ఏజెంట్లపై కఠిన నిఘా: కార్మికులను విదేశాలకు తరలించే ప్రతి ఏజెంట్ వివరాలను సేకరించి, వారు పంపించే ప్రతి ఒక్కరి పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలి.
*నైపుణ్యాభివృద్ధి & పర్యవేక్షణ: ఉద్యోగార్థులకు లైట్ మోటార్ వెహికల్ (LMV), హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్‌లోనూ ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. ఈ మొత్తం వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఓ మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని ప్రత్యేక సీఈవోగా నియమించనున్నారు.
*యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఒరవడి
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాైకాలతో తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.
- యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
- జర్మనీ, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ తదితర విదేశీ భాషలను అభ్యసించేందుకు వీలుగా ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి. స్థానిక భాషా నిపుణులతో పాటు ఆయా దేశాలకు చెందిన శిక్షకులను రప్పించి బోధన అందించాలి.
- ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తున్న మాదిరిగానే, బ్లూ కాలర్ జాబ్స్ కోసం శిక్షణ పొందే వారందరికీ స్కాలర్షిప్లు మంజూరు చేసే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలి.
*ఏటీసీల్లో భవిష్యత్ తరహా కోర్సులు – ఇంటర్న్‌షిప్‌లకు పెద్దపీట
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ATC), పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ కల్పించాలి. చదువుతూనే ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా విద్యార్థులకు స్టైఫండ్ లభించడంతో పాటు, భవిష్యత్ ఉద్యోగానికి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు సిద్ధిస్తాయని సీఎం పేర్కొన్నారు.
*అధునాతన కోర్సులు:ఏటీసీల్లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలి. ప్రస్తుతం మార్కెట్లో ఈవీల వాడకం భారీగా పెరుగుతున్నందున వాటి నిర్వహణపై నిపుణులైన సర్వీసింగ్ టెక్నీషియన్ల అవసరం ఎంతో ఉంది. అలాగే, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరుగుతున్నందున డ్రోన్ టెక్నాలజీ కోర్సులను ప్రత్యేకంగా అందుబాటులోకి తేవాలి.
*పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలు
దేశీయంగా మరియు అంతర్జాతీయంగా నర్సింగ్ సేవలకు అపూర్వ డిమాండ్ ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతుండటంతో ‘ఇంటికో నర్సు’ అనేలా డిమాండ్ నెలకొంది. ఈ భారీ డిమాండ్‌ను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు తగిన అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన, ఉపాధి & శిక్షణ డైరెక్టర్ నిర్మలా కాంతి వెస్లీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



