Thursday, September 17, 2026
Google search engine
Homeతెలంగాణటౌన్ ప్లానింగ్ వివాదాలు ఇకనైనా పరిష్కారం అవుతాయా..?( ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం.....

టౌన్ ప్లానింగ్ వివాదాలు ఇకనైనా పరిష్కారం అవుతాయా..?( ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం.. )

జీ.హెచ్.ఎం.సి. కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు కానున్న ట్రిబ్యునల్..
పట్టాన ప్రణాళిక విభాగం అభ్యంతరాలను సవాల్ చేసేందుకు ఉపయోగం..
ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవాలని ఎన్నోమార్లు ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు..
గత ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టలేదు.. ఇప్పటికి స్పందించిన రేవంత్ సర్కార్..
త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయని సమాచారం..

తెలంగాణ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో వివాదాలు చాలా ఎక్కువుగా ఉంటాయి.. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అవినీతికి పరాకాష్ట అనే వార్తలు కూడా చూస్తుంటాం.. లక్షల్లో ముడుపులు తీసుకోవడం.. నియమనిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం.. నచ్చిన వారికి, నచ్చిన చోట వారికి అనుకూలంగా పర్మిషన్లు లాంటి సంబంధిత కార్యక్రమాలు చేయడం రివాజుగా మారిపోయింది.. అయితే ఇలాంటివి ఇకమీదట జరుగకూడదని, సమస్యల పరిష్కారం వెనువెంటనే జరిగిపోవాలని గౌరవ హై కోర్టు సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు హర్షించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు.. ఇక టౌన్ ప్లానింగ్ అధికారుల వేధింపులకు గురయ్యే వారికి సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది..

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా టౌన్‌ప్లానింగ్‌ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయనుందని తెలియవచ్చింది.. కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల సముదాయంలోనే ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అతి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.. భవన నిర్మాణాల విషయంలో పట్టణ ప్రణాళిక విభాగం అభ్యంతరాలను సవాల్‌ చేసేందుకు ఈ ట్రైబ్యునల్‌ ఉపయోగపడనుంది. ఇప్పటిదాకా భవన నిర్మాణ అనుమతుల విషయంలో టౌన్‌ప్లానింగ్‌ విభాగం వేసే కొర్రీలను పరిష్కరించుకోవాలంటే హైకోర్టు లేదా ఇతర కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. అక్కడ విచారణ పూర్తయి, ఈ వివాదాలు పరిష్కారమయ్యేందుకు సాధారణంగానే చాలా సమయం పట్టేది. ఈ జాప్యాన్ని నివారించడానికి ఓ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసుకోవాలనిపలు సందర్భాల్లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇందుకు సంబంధించి గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దీనిపై ఇటీవల ఓ ఎన్జీవో కోర్టు ధిక్కరణ కింద ఫిర్యాదు చేయడంతో ట్రైబ్యునల్‌ ఏర్పాటు ఎప్పటిలోపు చేస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని బదులిచ్చిన ప్రభుత్వం.. హైకోర్టు వేసవిసెలవులు ముగిసేలోగా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కాగా ఈ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా జిల్లా జడ్జి వ్యవహరించనుండగా, సభ్యుడిగా పట్టణ ప్రణాళికా విభాగం నుంచి అనుభవం ఉన్న అధికారిని నియమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అనధికారిక నిర్మాణాలు, టౌన్‌ ప్లానింగ్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు గణనీయంగా పెరిగాయి. హైకోర్టు పరిధిలో గత ఐదేళ్ల వ్యవధిలో అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 2.50లక్షల పిటిషన్లు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల్లో 40-50శాతం నిర్మాణాలకు సంబంధించిన వివాదాలే ఉంటున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించడం.. వంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఇకపై ఇలాంటి వివాదాలన్నీ ట్రైబ్యునల్‌ పరిధిలోనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ ద్వారా మున్సిపల్‌ బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు మార్గం సుగమం చేసినట్లు సమాచారం. సాధారణ కోర్టుల కంటే వేగంగా కేసులను పరిష్కరించడమే కాకుండా టౌన్‌ప్లానింగ్‌ అధికారుల వేధింపులకు గురయ్యే వారికి ట్రైబ్యునల్‌ తక్షణ సాయం అందించేందుకు దోహదపడనుంది. అదే సమయంలో అనధికారిక నిర్మాణాలను త్వరగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments