- యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తి చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్
- విలువలతో కూడిన విద్యకు పెద్దపీట.. భాధ్యతాయుత పౌరుల తీర్చిదిద్దే బాధ్యత మనదే
హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ (వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యా కేంద్రంగా నిలవాలని రాష్ట్ర పోలీస్ బాస్ సీవీ ఆనంద్ ఆకాంక్షించారు. మంచిరేవులలో శరవేగంగా సాగుతున్న పాఠశాల నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన స్కూల్ సొసైటీ కమిటీ సమావేశంలో ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం (ఐపీఎస్‌ఓడబ్ల్యూఏ) అధ్యక్షురాలు లలితా ఆనంద్ మరియు కమిటీ సభ్యులతో కలిసి నూతన భవనాల నిర్మాణాలు, విద్యా ప్రణాళికలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పోలీసు కుటుంబాల సంక్షేమంతో పాటు ఈ విద్యాసంస్థ అభివృద్ధికి మహిళా సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
*విద్యార్థులతో డీజీపీ ఆనంద్ ఉల్లాసం
సమీక్షా సమావేశానికి ముందస్తుగా మైదానంలోకి అడుగుపెట్టిన డీజీపీ సీవీ ఆనంద్, చిన్నారులతో కలిసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన విలువిద్య, ఫెన్సింగ్ తదితర క్రీడా విన్యాసాలను తిలకించి వారి ప్రతిభను కొనియాడారు.

*ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్య
పోలీసు సిబ్బంది సంతానంతో పాటు అమరుల కుటుంబాల పిల్లలు, సామాన్య ప్రజల బిడ్డలకు సైతం ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను అందించాలనే లక్ష్యంతోనే ఈ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ స్పష్టం చేశారు. కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలు, అనన్యమైన దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యతలను చిన్ననాటి నుంచే అబ్బేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
*దుర్మార్గాలను ఎదుర్కొనేలా నైతిక విద్యాబోధన:
నేటి యువతలో వ్యసనాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి అనర్థాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి దూరంగా ఉంటూ, సన్మార్గంలో నడిచేలా విలువల ఆధారిత విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. దేశ భవిష్యత్తును నిర్మాణం చేసే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ విద్యాలయపు ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
*నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో భాగంగా పాఠశాల నూతన భవనాల నిర్మాణ పురోగతి, విద్యా విధానం, సిలబస్ రూపకల్పన, మౌలిక వసతుల కల్పనపై కూలంకషంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు, బిల్లులు, అభివృద్ధి పనులను సమీక్షించి తక్షణ ఆమోదాలు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు తరచూ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజాసేవపై అమూల్యమైన మార్గదర్శనం చేయాలని ఆదేశించారు.
గత ఏడాది కేవలం 125 మంది విద్యార్థులతో అంకురార్పణ జరుపుకున్న ఈ విద్యాసంస్థలో, ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి వరకు మొత్తం 345 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండటం విశేషం.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్, ఆక్టోపస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్, ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీ గజారావు భూపాల్, సైబరాబాద్ కమిషనర్ రమేష్, వెల్ఫేర్ ఐజీ ఉదయ్ కుమార్ రెడ్డి, శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ కుమార్, ప్రిన్సిపాల్ అనిత, వ్యవస్థాపకులు విశాల్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



