మై భారత్, రెడ్‌క్రాస్ నమోదును వేగవంతం చేయాలి: గవర్నర్
హైదరాబాద్:
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు ‘మై భారత్’ పోర్టల్ నమోదు ప్రక్రియతో పాటు ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ గవర్నర్ ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడంలో వీసీలు కీలక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
మంగళవారం లోక్ భవన్ లో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో గవర్నర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నషా ముక్త్ భారత్ కింద విశ్వవిద్యాలయాల పరిధిలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, మై భారత్, రెడ్‌క్రాస్ నమోదు పురోగతిని సమీక్షించారు. ప్రతి విశ్వవిద్యాలయం రోజువారీ ప్రగతిని మానిటరింగ్ చేయాలని, ప్రతి కళాశాలలో ఒక నోడల్ అధికారి మరియు స్టూడెంట్ అంబాసిడర్ ను నియమించి రిజిస్ట్రేషన్లను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
నషా ముక్త్ భారత్ తోనే వికసిత్ భారత్ పునాది
ప్రధానమంత్రి కలలుగన్న ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ఒక మహోద్యమమని గవర్నర్ అభివర్ణించారు. దేశానికి బలం యువతేనని, ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన, చైతన్యవంతమైన యువతతోనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ మహా యజ్ఞంలో విశ్వవిద్యాలయాలు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
లక్ష్యాలు – పురోగతి వివరాలు
- మై భారత్ పోర్టల్: రాష్ట్రానికి 14.90 లక్షల నమోదు లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 4.04 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఆగస్టు 14 లోపు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రాష్ట్ర లక్ష్యాన్ని నూటికి నూరుపాళ్లు సాధించాలి.
- నషా ముక్త్ యువ ప్రతిజ్ఞలు: 2.73 లక్షల ఆన్లైన్ ప్రతిజ్ఞల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 91 వేలకు పైగా నమోదయ్యాయి. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లు, అధ్యాపకులను భాగస్వామ్యం చేస్తూ వంద వారాల పాటు నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
యువతలో రెడ్‌క్రాస్ స్ఫూర్తి
గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో గత మూడు నెలల్లో 60 వేలకు పైగా కొత్త సభ్యులు చేరడంతో మొత్తం సభ్యత్వం 1.17 లక్షలకు చేరిందని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు. రక్తదానం, విపత్తు సహాయక చర్యలు, థలసేమియా బాధితుల సేవల్లో రెడ్‌క్రాస్ సేవలు అనన్యసామాన్యం అన్నారు. ఆగస్టు 15 నాటికి విశ్వవిద్యాలయాల నుంచి 16 వేల మంది కొత్త సభ్యులను చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
సందర్భంగా నషా ముక్త్ భారత్ ప్రచార పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్, మై భారత్ డైరెక్టర్, వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు.



