పేదల ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి
‘బీ’ బ్లాక్ బీఎల్ఏలు, సూపర్‌వైజర్లు, పార్టీ నేతలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం
ఇబ్రహీంపట్నం:
సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత సీరియస్‌గా తీసుకొని పనిచేయాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ‘ఏ’ బ్లాక్ నేతలతో సమావేశం కాగా, మంగళవారం ‘బీ’ బ్లాక్ నాయకులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
తొర్రూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ‘బీ’ బ్లాక్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, తుర్కయంజాల్, తొర్రూర్, పెద్దఅంబర్‌పేట్, కుంట్లూర్ డివిజన్లకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ), సూపర్‌వైజర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన కసరత్తు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రత్యేకంగా నియమించిన చైతన్య కూడా పాల్గొని దిశానిర్దేశం చేశారు.
*పేదల ఓట్ల పరిరక్షణే ధ్యేయం:
ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలు, బడుగు, బలహీన వర్గాల ఓట్లు తొలగిపోకుండా నాయకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రంగారెడ్డి నిర్దేశించారు. పార్టీ ఓటర్లను కాపాడటంలో విఫలమైతే ఏ హోదాలో ఉన్నవారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలుంటాయని పార్టీ అధిష్ఠానం ఇప్పటికే హెచ్చరించిందని గుర్తుచేశారు. కాబట్టి ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడానికి వీలే లేదన్నారు. కిందిస్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఓట్ల సంరక్షణపైనే పూర్తి దృష్టి సారించాలని ఆదేశించారు.
*పారదర్శకతతో ముందుకు సాగాలి:
ఓటర్లతో నిరంతరం సమన్వయం చేసుకొని, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పారదర్శకంగా పూర్తయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ కోసం బూత్ లెవెల్ అధికారులకు అందించాలని సూచించారు. బీఎల్‌ఏలు బూతుల వారీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.



