రైతులకు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు –ట్రాన్స్‌పోర్టర్లపై కేసులు నమోదు చేస్తాం : కలెక్టర్ దీపక్ తివారి హెచ్చరిక
ముఖ్యమంత్రి ఆదేశాలతో కోడంగల్ – తాండూర్ నియోజకవర్గాల్లో కలెక్టర్ విస్తృత పర్యటన
వికారాబాద్:
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కోడంగల్, తాండూర్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తాండూర్ మండలంలోని గోనూర్ గ్రామంలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తనను సంప్రదించాలని రైతులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరంలక్ష్మీనారాయణపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ రైస్ ఇండస్ట్రీస్‌ను కలెక్టర్ పరిశీలించారు, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం లారీలను ఆలస్యం లేకుండా వెంటనే అన్‌లోడ్ చేయాలని మిల్ యజమాని బాలేశ్వర్ గుప్తాకు ఆదేశించారు. ట్రాన్స్‌పోర్ట్ సమస్యలు ఉన్నాయని మిల్ యజమాని వివరించగా, రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఎంను ఆదేశించారు.
ట్రాన్స్‌పోర్ట్ నిర్లక్ష్యంతో రైతులు ధర్నాలకు దిగే పరిస్థితి వస్తే సంబంధిత ట్రాన్స్‌పోర్టర్లపై కేసులు నమోదు చేస్తాం” అని కలెక్టర్ స్పష్టం చేశారు.
తర్వాత తాండూర్‌లోని జిల్లా సహకార మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ పెంచాలని డీసీఎంఎస్ అధికారులను ఆదేశించారు.
ఇదే పర్యటనలో భాగంగా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ వన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో పాల్గొన్నారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ,
వికారాబాద్ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహిస్తాం. సమస్యలు ఉంటే రైతులు నేరుగా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనిత, ఎమ్మార్వోలు వెంకటస్వామి, తారా సింగ్, డి సి ఎం ఎస్ అధికారి మోహన్ కృష్ణ, సలీం అధికారులు తదితరులున్నారు.


