బాలాపూర్:
త్రేతాయుగం నుండి ఆధునిక కాలం వరకు విఘ్నేశ్వరుని పూజించడం భారతీయ సంప్రదాయంలో విశిష్ట భాగం. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంలో హైదరాబాద్ పరిధిలోని ప్రముఖ బాలాపూర్ గణనాథుని దర్శనం కోసం పలువురు ఉన్నతాధికారులు విచ్చేశారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సమక్షంలో ప్రత్యేక పూజలు.
*అధికారులకు ఘన సత్కారం:
గణనాథుని దర్శించుకున్న ఉన్నతాధికారులను బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బాలాపూర్ ఆనవాయితీ ప్రకారం శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఉత్సవాల నిర్వహణ, శాంతిభద్రతలు, పారిశుధ్యం, రవాణా వ్యవస్థల పర్యవేక్షణలో అధికారుల పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు.
*సాంస్కృతిక వారసత్వం – ఆధ్యాత్మిక శోభ:
పురాణాల ప్రకారం ఏ విఘ్నం రాకుండా కార్యం దిగ్విజయంగా పూర్తి కావడానికి గణపతి ఆరాధన ముఖ్యమైనది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బాలాపూర్ లడ్డూ వేలం, స్వామివారి ఊరేగింపు ప్రాశస్త్యాన్ని మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఉన్నతాధికారులకు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఉత్సవ కమిటీతో కలిసి అధికార యంత్రాంగం అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


