- నిబంధనలకు తిలోదకాలు: హయత్ నగర్లో అక్రమ కట్టడాలపై అధికారుల కొరడా!
- ఎట్టకేలకు భారత శక్తి కథనాలకు స్పందించిన అధికారులు..
హయత్ నగర్:
హయత్ నగర్ సర్కిల్-14 పరిధిలోని విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని, కెప్టెన్ కుక్ హోటల్ పక్కన జరుగుతున్న భారీ వాణిజ్య నిర్మాణం నిబంధనల ఉల్లంఘనకు నిలువెత్తు నిదర్శనంగా మారుతోంది. సర్వే నంబర్ 263, ప్లాట్ నంబర్ 23లో సాగుతున్న ఈ అక్రమ కట్టడంపై వెలువడిన వరుస కథనాలకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారం 400 గజాల స్థలాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒక్కో ప్లాట్‌కు 200 గజాల చొప్పున జీ ప్లస్ టు (G+2) నివాస గృహాల కోసం మాత్రమే అనుమతులు పొందారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా వాణిజ్య అవసరాల కోసం బహుళ అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తూ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు.

*భారీ పన్ను ఎగవేత – మార్టిగేజ్ మోసం
వాణిజ్య భవనాలకు చెల్లించాల్సిన భారీ అభివృద్ధి రుసుములు, మున్సిపల్ ఫీజులను ఎగవేయడమే కాకుండా, మున్సిపాలిటీకి కేటాయించాల్సిన మార్టిగేజ్ స్థలాన్ని కూడా అక్రమార్కులు స్వాహా చేశారు. ఈ మోసం ద్వారా కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి కొందరు గండి కొడుతున్నారు. ప్రజల ధనాన్ని, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
*పాక్షికంగా కూల్చివేత చర్యలు
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్ జోన్, హయత్ నగర్ సర్కిల్-14 పరిధిలో డిప్యూటీ కమిషనర్ అజ్మీరా స్వామి, టౌన్ ప్లానింగ్ అధికారిణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18 శుక్రవారం రోజున ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. వివాదాస్పదంగా నిర్మించిన అక్రమ కట్టడాన్ని సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు.
*చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: టౌన్ ప్లానింగ్ అధికారిణి విజయలక్ష్మి
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారిణి విజయలక్ష్మి స్పందిస్తూ, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎంతటి వారైనా సరే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సెల్లార్లో తేల్చిచెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగే అనధికార కట్టడాలపై అధికారులు ఇదే రకమైన ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.




