Thursday, July 23, 2026
Google search engine
Homeఇంటర్నేషనల్మున్సిపల్ సీజింగ్ లను ధిక్కరిస్తున్న అక్రమ నిర్మాణదారులు..!

మున్సిపల్ సీజింగ్ లను ధిక్కరిస్తున్న అక్రమ నిర్మాణదారులు..!

  • *సీజింగ్ బోర్డులకే పరిమితం.. నిబంధనల ఉల్లంఘనలో రికార్డులు!
  • *నాగోల్ సర్కిల్‌లో ఓపెన్ స్పేస్ జోన్లో చెలరేగుతున్న అక్రమ నిర్మాణాలు.
  • *సీజ్‌ చేసినా ఆగని పనులు | మౌనం వహిస్తున్న యంత్రాంగంపై పౌరుల ఆగ్రహం
  • ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఎస్.టి.ఎఫ్.టీం దృష్టి సారించాలి..!

నాగోల్:

శాసనాలు, పురపాలక నిబంధనలు కేవలం సామాన్యులకే పరిమితమా? బడా నిర్మాణదారులకు అవేమీ వర్తించవా? పురపాలక అధికారులు స్వయంగా వేసిన సీజింగ్ ముద్రలను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటి? ఇవీ నాగోల్ డివిజన్ పరిధిలోని స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిలదీతలు.

*’ఓపెన్ జోన్’ స్థలంలో నిబంధనల ఉల్లంఘన
నాగోల్ – బండ్లగూడ ప్రాంతంలోని డి-మార్ట్ వెనుక భాగంలో ఉన్న గోపాలకృష్ణ పురం, రహదారి సంఖ్య-2లోని సర్వే సంఖ్యలు 40, 41 పరిధిలోని ప్లాట్ సంఖ్య 204 (విస్తీర్ణం: 400 చదరపు గజాలు) లో ఎలాంటి పురపాలక అనుమతులు లేకుండా భారీ నిర్మాణం కొనసాగుతోంది.

*మాస్టర్ ప్లాన్ ఉల్లంఘన: మాస్టర్ ప్లాన్ ప్రకారం ‘ఓపెన్ స్పేస్ జోన్’ (ఖాళీ స్థలాల మండలం) గా వర్గీకరించిన ఈ స్థలంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతి ఉండదు. కానీ, చట్ట విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు.
*భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు: ప్రాథమిక అగ్నిమాపక భద్రతా నియమావళిని, భవన నిర్మాణ నిబంధనలను పూర్తిగా పక్కనపెట్టి నిర్మాణ పనులు సాగిస్తున్నారు.
*చట్ట దిక్కరణ: గతంలో నాగోల్ సర్కిల్ పురపాలక అధికారులు ఈ నిర్మాణాన్ని సీజ్ చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే, ఆ సీజింగ్ ముద్రలను తొలగించి, అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తూ నిర్మాణదారుడు యథేచ్ఛగా పనులు కొనసాగిస్తున్నాడు.

*భూ వినియోగ శాస్త్రం, పర్యావరణ సూత్రాలకు విరుద్ధం
నగర ప్రణాళిక శాస్త్రం ప్రకారం ఓపెన్ స్పేస్ జోన్‌లు నగరానికి ఊపిరితిత్తుల లాంటివి. పర్యావరణ సమతుల్యత, వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయేందుకు ఇవి అత్యంత కీలకం. ఇటువంటి స్థలాల్లో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోవడమే కాకుండా, భవిష్యత్తులో వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉందని నగర ప్రణాళిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*అధికారుల పాత్రపై పౌరుల సందేహాలు
అధికారులు సీజ్ చేసిన స్థలంలో బహిరంగంగా పనులు జరుగుతున్నా స్థానిక యంత్రాంగం స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది ప్రజలు సంతకాలతో కూడిన ఫిర్యాదు పత్రాలను అధికారులకు అందజేసినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం వెనుక అవినీతి కోణం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల డిమాండ్:
చట్టాన్ని సవాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సదరు వ్యక్తిపై, అలాగే ఫిర్యాదులు వచ్చినా స్పందించకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారులపై తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments